– విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ పిలుపు
జూలూరుపాడు, మే 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ రోడ్డు, గుండెపుడి సమీపంలో గల ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం (మే 3వ తేదీ) ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సొడె శ్రీరామ్ మాట్లాడుతూ.. “గడప లోపల కులం.. గడప దాటితే మనమంతా హిందువులం” అనే నినాదంతో ఈ భారీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న భేదాలను పక్కన పెట్టి, ధార్మిక, సాంస్కృతిక విలువలను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఐక్యతా సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని, గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ సమ్మేళనం చారిత్రాత్మకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ, హిందూ బంధువులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెంగల నరసింహారావు, వందనపు కమలాకర్, యలమద్ది సాయి కృష్ణ, ఇజ్జడి మురళి కృష్ణ, వేల్పుల బోసు, ఉడత వెంకటేశ్వరరావు, బండ్ల వెంకటేశ్వర రావు, పెండ్యాల నరేష్, నరేంద్ర, వేముల నాగేశ్వరావు, వూకె నాగేశ్వరావు, కృష్ణ ప్రసాద్, సోడె నరేంద్రనాథ్ భగవత్ పాల్గొన్నారు.