Himayat Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు జలాశయాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ 15 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 12,600, ఔట్‌ఫ్లో 13,335 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 3.9 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.67 టీఎంసీలుగా ఉంది.
హిమాయత్ సాగర్‌కు కూడా వరద పోటెత్తింది. సాగర్ 11 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 18,500, ఔట్‌ఫ్లో 20,872 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 2.97 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ 2.76 టీఎంసీలుగా ఉంది.
ఈ క్రమంలో మూసీ వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.