కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేస్తున్నది. జీఎస్టీ సంస్కరణలు చేపట్టడంతో వంటగది సరుకుల పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో తగ్గిన పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గినట్లు కనిపించడం లేదు. వివిధ వస్తువులను పాతస్టాక్ పేరుతో పాత ధరలకే వ్యాపారులు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ ప్రకారం సవరించిన ధరలకే విక్రయాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 26 ( నమస్తే తెలంగాణ) : నూతన జీఎస్టీ ప్రకారం..చాక్లెట్లు, బిస్కెట్లు, బాదం, పిస్తా, కర్జూరం, కొవ్వొత్తులు, అంజీర్, వెన్న, నెయ్యి, చీజ్, శుద్ధి చేసిన చక్కెర, కొబ్బరి, కాఫీ, నమ్కీన్, భుజియా, ఊరగాయలు(అచార్), సుప్లు, టూత్ పౌడర్, బేకింగ్ పౌడర్ 12 శాతం పన్ను కలిగి ఉండగా 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. వీటితో పాటు సబ్బులు, టూత్పెస్ట్లు, టూత్ బ్రష్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, టాల్కం, ఫెస్ పౌడర్, షేవింగ్ క్రిమ్, లోషన్ 18 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ధరల తగ్గుదల విషయంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వస్తువుల విక్రయ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలులోకి రావడం లేదు.
జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల విక్రయించేందుకు సూపర్ మార్కెట్లు, పెద్ద దుకాణాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని పలు సూపర్ మార్కెట్లో జీఎస్టీ వివరాలతో కూడిన బిల్లులు ఇవ్వడం లేదు. జీఎస్టీ సవరణలో భాగంగా ప్రజలు వాడే విత్యావసర సరకుల ధరలు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, జీఎస్టీ వివరాలు లేకపోవడంతో వస్తువుల ధరలు తగ్గాయా ? లేదా ? అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. కొన్ని దుకాణాల్లో జీఎస్టీతో కలిపి బిల్లు అని ఇస్తున్నా వివరాలు మాత్రం కనిపించడం లేదు. తగ్గిన వస్తువుల ధరలకు సంబంధించి దుకాణాల్లో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ తగ్గించడంతో వస్తువుల ధరలు ఏ మేరకు తగ్గించారనే విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పాత ధరలతో ఉన్న వస్తువుల ధరలు తగ్గితే కొత్త ధరల స్టిక్కర్లు అంటించాలి. కానీ జిల్లాలో ఏ దుకాణాల్లో ఈ నిబంధనలు అమలు కాకపోగా బోర్డులు ఏర్పాటు చేయలేదు.
ఆదిలాబాద్ జిల్లాలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. పండుగలను పురస్కరించుకొని ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర, వంట సరుకులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కేంద్రం తగ్గించిన జీఎస్టీ పన్నులతో ప్రజలకు కొంతమేరకు ప్రయోజన చేకూరుతుందని ఆశించినా ఫలితం కనపడడం లేదు. దీంతో సూపర్మార్కెట్లు, పెద్ద దుకాణాలు సూచించిన ధరలను చెల్లిస్తూ ప్రజలు తమకు వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. జీఎస్టీ తగ్గుదల విషయంలో జిల్లా వాణిజ్య పన్నుల అధికారులను సంప్రదించగా తగ్గిన పన్నుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.