Kantara Chapter 1 | పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కాంతార: ఏ లెజెండ్ (Kantara Chapter 1)’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్. రిషబ్ శెట్టి ఈ సినిమాకు కథ, దర్శకత్వం అందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబందించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ భారీ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
తెలుగు ట్రైలర్‌ను ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయగా, ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకి ఎన్టీఆర్ హాజరవుతుండటం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. రిషబ్ శెట్టి, ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న స్నేహబంధం, అనుబంధం ఈ సందర్భంగా మరోసారి కనిపించనుంది. ఎన్టీఆర్ తల్లి కర్ణాటక కావడంతో ఆయనకు కన్నడ భాషపై ప్రత్యేక అభిమానం ఉంది. గతంలో కుటుంబంతో కలిసి కర్ణాటక దేవాలయాలకు వెళ్లిన సమయంలో రిషబ్ శెట్టి కుటుంబాన్ని కలిసాడు జూనియర్. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత కాంతార ప్రీక్వెల్ ఈవెంట్లో ఎన్టీఆర్, రిషబ్ కలిసి కనిపించి సందడి చేయనున్నారు.
చిత్ర కథ విషయానికొస్తే… ఈసారి కథను పూర్తిగా కొత్త కోణంలో చూపించనున్నారు. ‘కాంతార’లో సప్తమీ గౌడ కథానాయికగా కనిపించగా, ఈ ప్రీక్వెల్‌లో యువరాణిగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. దిల్షాన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ‘కాంతార: ఏ లెజెండ్’ ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకుంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే, ఈ సినిమాకి అన్ని భాషల్లోనూ భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్ మరింత ఊపందుకోనుంది.