హనుమకొండ చౌరస్తా, జనవరి 9 : వారసత్వ సంపదలు దేశానికి గర్వకారణమని హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్(Rohit Thakur) అన్నారు. చారిత్రిక రుద్రేశ్వరస్వామి వారి వేయి స్తంభాల దేవాలయాన్ని ఆయన వారి సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఆలయ చరిత్ర తెలుసుకొని అబ్బురపడ్డారు. ఇంత ఘన చరిత్ర కలిగిన చారిత్రిక దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండడం చాలా గొప్ప విశేషమని, ప్రతి భారతీయుడు చరిత్రను తెలుసుకొని మన దేశ సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడానికి మనమందరం ప్రయత్నం చేయాలన్నారు.
ఆలయ స్తంభాలలో చెక్కిన సూది పట్టే రంధ్రాలు, తలకిందుల చాప, తలకిందుల మనిషి వారు పరిశీలించారు. తెలంగాణ రాష్ర్టంలో విద్యాశాఖపై జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి ఈ ప్రాంతం వచ్చానని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంశాలను పరిశీలించడానికి తనతోపాటు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యాశాఖకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆశిష్ కోహ్లీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, రాజేష్ శర్మ ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌తో కలిసి పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు.
దేవాలయాన్ని సందర్శించిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో వారు మమేకమై, వారు చదువుతున్న చదువుల విషయం తెలుసుకొని టీచర్స్ ఏ విధంగా పాఠాలు నేర్పుతున్నారు? ఏ విధంగా ఉత్తీర్ణులవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, సిబ్బంది మధుకర్, అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డీవీఆర్ శర్మ పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వర్తించారు.