Southwest Monsoon |హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ మందకొడిగా సాగుతు న్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందని, మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని వెల్లడించింది. గురువారం రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని పేర్కొన్నది.
వచ్చే రెండు, మూడురోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
కాగా, గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 10.33 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. జూలూరుపాడులో 9.94 సెం.మీ, గుండాలలో 8.0 సెం.మీ, సుజాతనగర్లో 5.92 సెం.మీ, ఖమ్మం జిల్లా కల్లూరులో 8.85 సెం.మీ, తల్లాడలో 5.65 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 5.91 సెం.మీ, గంగవరంలో 5.0 సెం.మీ, సంగారెడ్డిలో 5.35 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 5.48 సెం.మీ, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 3.95 సెం.మీ, అయిటిపాములలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది.