హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో అమలవుతున్న ఉపాధిహామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ఆర్థికసంఘం నిధుల వినియోగం, జీవనోపాధి, సామాజిక తనిఖీ తదితర కీలక కార్యక్రమాల అమలుపై సర్కార్ నిఘా పెట్టనున్నది. పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టేందుకు కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ పీఆర్ఆర్డీ కమిషనర్ డీ దివ్యాదేవరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషనరేట్‌లోని డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకు అన్ని జిల్లాలను కవర్ చేసేలా ఒకరికి 2 జిల్లాల బాధ్యతలు అప్పగించారు. జిల్లా పర్యటన సందర్భంగా కనీసం రెండు పంచాయతీలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చేయడంతోపాటు నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో నాణ్యత, అధికారుల జవాబుదారీతనం పెంచడమే ఈ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఆ శాఖ మంత్రి సీతక్క గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లులు డ్రా, నిధుల ఖర్చు, నిధులు మళ్లింపు వంటి అక్రమాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.