హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టు పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరితోపాటు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి జలసౌధలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమీక్షించారు.
ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను అడిగి ప్రాజెక్టుల వారీగా పనులు, క్షేత్రస్థాయిలో సమస్యల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. సీతమ్మసాగర్ సహా అన్ని పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని, భూసేకరణ, అటవీ అనుమతులు, పునరావాసం, నిధుల కొరత తదితర సమస్యలను త్వరితగతిన పరిషరిస్తామని తెలిపారు. సీతారామ, పాలేరు లింక్ కెనాల్, మున్నేరు-పాలేరు అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. సమావేశంలో ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్సీలు, సీఈలు పాల్గొన్నారు.