హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని సలం చెరువు ఆక్రమణలకు గురైందా? లేదా? అందులో నిర్మాణాలున్నాయా? లేవా? అన్నదానిపై ప్రభుత్వ శాఖలు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన నిర్మాణాలు, జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు, సలం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయకపోవడంపై కోర్టు ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీయే, నీటిపారుదల శాఖ, విద్యాశాఖలు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని తప్పుబట్టింది. అధికారికంగా ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశాక ఎఫ్టీఎల్ ఎలా తగ్గుతుందని ప్రభుత్వాన్ని నిలదీసింది. బుల్డోజర్ కేసులో నీటివనరుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది. చెరువు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదని, చెరువులో నిర్మాణాలున్నాయో లేదో కూడా చెప్పడంలేదని ఆక్షేపించింది. ఇన్నేండ్లుగా అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని శాఖలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
సలం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్, జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్‌కు లేదనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. చెరువుల సంరక్షణ కోసమే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసిందని, భవిష్యత్తు తరాల కోసం చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. నీటి వనరులను ప్రభుత్వం రక్షించాల్సిందేనని, ఎవరూ చట్టానికి అతీతం కాదని స్పష్టంచేశారు. మరోవైపు పిటిషనర్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ నేపథ్యంలో తనకు, కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ అభ్యంతరమైన అంశాలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడానికి చర్యలు తీసుకుంటామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పౌరుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించినప్పుడు కోరకపోయినా తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు.
హైదరాబాద్‌లోని బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలో ఒవైసీకి చెందిన సలార్ ఎ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి ఈనెల 6న యథాతథ స్థితిని కొనసాగించాలంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గురువారం ఉపసంహరించుకుంది. ఒవైసీకి చెందిన ఇలాంటి కేసు మరో న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయం తెలియడంతో గత ఉత్తర్వులను ఉపసంహరించారు. సలార్ ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఈ నెల 6న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చాలంటూ న్యాయవాది విజయగోపాల్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టి ఒక అంశానికి సంబంధించి మరో న్యాయమూర్తి విచారిస్తుండగా సమాంతరంగా మరో పిటిషన్‌పై విచారణ చేపట్టడం సరికాదని అన్నారు.