హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఓ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా న మోదైన క్రిమినల్ కేసులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు వెంకటేశ్, రాణా, అభిరామ్లకు హైకోర్టులో చుకెదురైంది. నాంపల్లి కోర్టులో వారిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. లీజు వివాదంపై కోరె నందుకుమార్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని సు రేశ్, వెంకటేశ్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇది పూర్తిగా సివిల్ స్వభావానికి చెందినదని, క్రిమినల్ కేసుగా మార్చి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
ప్రతివాది తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లీజు ప్రాంతంలోకి పిటిషనర్లు అక్రమంగా ప్రవేశించారని, తలుపులు పగులగొట్టి, వస్తువులు తీసుకెళ్లారని చెప్పారు. దీనిపై ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి కోర్టు కేసు విచారణ చేపట్టిందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి సివిల్ వివాదం నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదైందన్న కారణంగా కేసును కొట్టివేయలేమని పేరొన్నారు. పిటిషనర్లపై క్రిమినల్ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని అన్నారు. ఫిర్యాదుతోపాటు అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నాకే మెజిస్ట్రేట్ ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు. ఫిర్యాదులోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.