హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించింది. రాజ్యాంగంలోని అధికరణ 243(ఓ) కింద ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యంపై స్పష్టమైన నిషేధం ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకావడంతోపాటు మొదటి, రెండో విడతల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దశలో ఎన్నికల్లో కలుగజేసుకోబోమని స్పష్టం చేసింది. ఎస్టీ జనాభా లేకపోయినా వారికి రిజర్వు అయిన ప్రదేశాల్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అలాంటి పంచాయతీలకు ప్రభుత్వంతో చర్చించి తరువాత ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం హామీని హైకోర్టు అంగీకరించింది. నల్లగొండ జిల్లా, అనుముల మండలం, శివాలయం పేరూరు గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం, వంజరపల్లి పంచాయతీల్లో ఎస్టీ ఓటరు ఒకరు లేకపోయినా సర్పంచ్‌తోపాటు మరికొన్ని వార్డు స్థానాలను వారికి కేటాయించారు.
మరికొన్ని పంచాయతీల్లో కూడా తగిన జనాభా లేకపోయినా రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన బెంచ్ గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2011 జనాభా లెకల ప్రకారం ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించారని పేర్కొన్నారు. కానీ ఆ తరువాత గ్రామ పంచాయతీల విభజన జరిగిందని, దీంతో కొన్ని పంచాయతీల్లో ఎస్టీలే లేకుండా పోయారని, కొన్నింటిలో ఒకటిరెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు నిలిపివేయాలని కోరడంలేదని, కేవలం రిజర్వేషన్లను సవరించాలని మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ 2011 జనాభా గణాంకాలు తప్ప మరే ఇతరత్రా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేమని, దాని ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపజేశామని తెలిపారు. ఎస్టీలు లేని పంచాయతీ రిజర్వేషన్ల పరిధిలో ఉన్నట్లయితే ప్రస్తుతం ఎన్నికలు జరగవని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం అధ్యయనం లేకుండా రిజర్వేషన్లు కేటాయించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యానికి రాజ్యాంగ నిషేధం ఉన్నదని తెలిపింది. ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నదని, పిటిషనర్ల అభ్యంతరాలను సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లవచ్చంటూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.