నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : లగచర్ల రైతులపై పోలీసులు నమోదు చేసిన కేసులో 80 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న రెండో ముద్దాయి సురేశ్‌కు జైలు నుంచి విముక్తి లభించింది. ఈ కేసులో ప్రత్యేక పీడీపీపీ కోర్టు ఇటీవల సురేశ్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మరోవైపు క్రైమ్ నంబర్ 154, 155 కేసులో ఆయనను అరెస్టు చేయరాదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సురేశ్ రూ.50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను మంగళవారం కోర్టుకు సమర్పించారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సురేశ్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తంచేశారు. సురేశ్ వారానికోసారి బొంరాస్‌పేట పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మేల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు 36 మంది రైతులు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.