హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పిటిషనర్‌కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్‌లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆదేశించారు. కోర్టు ధికరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో జనవరి 9న జరిగే విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఫాం1 నోటీసులు జారీచేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం, కరీంనగర్ రీజియన్ ఎస్ ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావు స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
స్వయంగా హాజరు నుంచి మినహాయింపు కోరేందుకు ఏవిధమైన అభ్యర్థనలు చేయవద్దని స్పష్టంచేశారు. సివిల్ పనులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదంటూ కే ఆనంద్ అండ్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎల్ పాండు వాదిస్తూ, అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని చెప్పారు. బాధ్యులైన అధికారులపై కోర్టు ధికరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గత విచారణకు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, కరీంనగర్ జిల్లా ఎస్ఈ, పంచాయతీరాజ్ ఇంజినీర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హాజరై కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసింది. ఎందుకు కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదని ప్రశ్నించింది. అధికారులు పలుమార్లు విచారణకు హాజరైనప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీసింది. అనంతరం విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.