బండి పక్కకు పెట్టండి. మీ వాహనంపై పది చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అవికట్టి బండి తీసుకుపోండి అంటూ ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుల తాళాలు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఈ తరహా ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల విధానాన్ని తప్పుబట్టింది. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్లను కట్టాలంటూ బలవంతం చేయొద్దని, చలాన్లు చెల్లించాలంటూ బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపివేయడం లాంటివి చేయొద్దని హెచ్చరించింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే పోలీసులు వసూలు చేయాలని, చెల్లించడానికి ఇష్టపడకపోతే నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వాహనదారులకు ఊరటనిచ్చాయి.
-సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ)
నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నది కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించడానికే కానీ.. కూడళ్ల పక్కన గుంపులుగుంపులుగా నిలబడి ట్రాఫిక్ కంట్రోలింగ్ లేకుండా పెండింగ్చలాన్లు వసూలు చేయడానికి కాదని ఓ సీనియర్ పోలీసు అధికారి హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పట్లో ట్రాఫిక్ చలాన్ల కంటే నియంత్రణపైనే ఎక్కువ దృష్టి పెట్టి వాహనాల సగటు వేగాన్ని పెంచిన పోలీసులు కొంతకాలంగా చలాన్ల వసూళ్లపైనే దృష్టి పెట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో రద్దీ వేళల్లో ట్రాపిక్ జామ్‌లతో.. నత్తను తలపించే వాహనాల వేగంతో వాహనదారులు బేజారవుతుంటే ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు చలాన్ల వసూళ్లే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.
గత సంవత్సరం బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో ఓ వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో ట్రాఫిక్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలోని చాలాచోట్ల వాహనదారులు ప్రయాణం చేసేందుకు జంకుతున్నారు. కాగా కొందరు వాహనదారులు రోడ్లపై ఇష్టారాజ్యంగా వెళ్తుండడంతో ట్రాఫిక్ నిబంధనలు వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు చలాన్లపై దృష్టిపెట్టి నియంత్రణ వ్యవహారాన్ని గాలికొదిలేశారు. నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడానికి మౌలిక వసతుల లేమి, ఆక్రమణలు, సిబ్బంది కొరతతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు పెండింగ్ చలాన్ల వసూలు కోసం పోలీసులు చేస్తున్న హడావిడి కూడా ఒక కారణంగా నగరవాసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో గత సంవత్సరం రోజుకు సగటున 44వేల ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఒక్క సైబరాబాద్‌లోనే గత సంవత్సరం 36లక్షల వాహనాలపై ట్రాఫిక్ ఉల్లంఘనుల నుంచి వసూలు చేసిన చలాన్ల మొత్తం రూ.239 కోట్లు ఉందంటే ట్రాఫిక్ పోలీసులు వీటిపై ఎంతగా దృష్టి పెట్టారో అర్థమవుతోంది. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ చలాన్లు వసూలు చేయడం, ఉల్లంఘనులను గుర్తించి ఫొటోలు తీసే వారిలో అక్కడక్కడా చేతివాటాన్ని కూడా ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోడ్లపైకి రావాలంటే జేబుల్లో డబ్బు, బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాల్సిందే లేదంటే వాహనాలు ఇంట్లో పెట్టి నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉందంటూ పలువురు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖానకు వెళ్లేవారు, ఇతర అత్యవసర పరిస్థితులకు వెళ్లేవారు ఎందరో ఉంటారని, రోడ్లపై వాహనాలు ఆపేసి గంటలు గంటలు నిలబెట్టి పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

ట్రాఫిక్ చలాన్ల వసూలు నియమాల ప్రకారం పోలీసులు నేరుగా వాహనం తాళాలు లాక్కోవడం కానీ బలవంతం కానీ చేయకూడదు. కోర్టు ప్రక్రియ పాటించాలి చలాన్ జారీ అయిన అరవై రోజుల్లోగా చెల్లించాలి.. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లేదా థర్డ్ పార్టీ యాప్ ద్వారా చెల్లించవచ్చు చెల్లించిన రశీదు భద్రంగా ఉంచుకోవాలి. లైట్ మోటార్వెహికల్స్, హెవీలోడ్ వెహికల్స్, మీడియం వాహనాలకు అన్నిటికి కలిపి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 73రకాల పెనాల్టీలు విధించవచ్చు. ఈ చలాన్లను వాహనదారుడే స్వచ్ఛందంగా చెల్లించాలి తప్ప బలవంతంగా వసూలు చేయరాదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వీటికి విరుద్దంగా వాహనదారులను రోడ్డుపైనే ఆపి బలవంతంగా పెండింగ్ చలాన్లు వసూలు చేయడం సరికాదు.
రెండు నెలల క్రితం ట్రై కమిషనరేట్ల పోలీసులు పెండింగ్ చలాన్లపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. పదికి మించి చలాన్లు పేరుకుపోయిన వాహనాలను వెంటనే సీజ్ చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మీడియాతో చెప్పారు. ఆ తర్వాత ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి హాజరై ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాహనదారులకు చలాన్ పడితే ఆటోమేటిక్‌గా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ డబ్బులు కట్ అయ్యేలా చేయాలని చెప్పారు. వాహనం రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడే వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని, ఉల్లంఘనలకు చలాన్లు పడితే ఆ వాహనయజమాని అకౌంట్ నుంచి నగదు బదిలీ అయ్యేలా సాంకేతిక సహకారం తీసుకోవాలన్నారు. వాహనదారులకు చలాన్ పడితే వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావాలనే విషయం ప్రజల్లో చర్చనీయాంశమైంది. బ్యాంకులో ఉండే డబ్బులు చలాన్లకే పోతే తమ పరిస్థితి ఏంటంటూ చాలా మంది సోషల్‌మీడియాలో దుయ్యబట్టారు.