లిప్‌స్టిక్.. అమ్మాయిల అందాన్ని పెంచుతుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్నీ నింపుతుంది. అందులోనూ ఎరుపు రంగు లిప్‌స్టిక్.. వారిని ఉన్నతంగా చూపిస్తుంది. లిప్‌స్టిక్ రంగులు, వాటిని ఇష్టపడే మహిళలపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం.. ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇతర రంగులతో పోలిస్తే, ఎరుపురంగు లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు మరింత ఆకర్షణీయంగా ఉంటారని, బలాన్ని, ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తారని సదరు అధ్యయనం తేల్చింది. జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎరుపు రంగు పెదవులు ఆరోగ్యానికి సంకేతం కూడా! మంచి రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యత ఉన్న మహిళల్లో.. సహజంగానే పెదవులు ఎరుపురంగులో ఉంటాయని అధ్యయనకారులు గుర్తించారు. ఇక రెడ్ లిప్‌స్టిక్ ధరించిన మహిళల్ని.. మరింత నమ్మకంగా, సమర్థులుగా, ఆధిపత్యం చెలాయించేవారిగా భావిస్తారని ఇంతకుముందే మాంచెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కనుగొన్నారు.
ఎరుపు రంగు లిప్‌స్టిక్.. ప్రజలు మిమ్మల్ని గమనించేలా చేస్తుందట. వారు మిమ్మల్ని గమనించినప్పుడు.. మీరు చెప్పేది శ్రద్ధగా వింటారు కూడా! మరో విషయం ఏమిటంటే.. ఎర్రటి లిప్‌స్టిక్ కొందరిని భయపెడుతుంది కూడా. దాంతో, వారిపట్ల జనాలు భయభక్తులతో మెలుగుతారట. ఇక ఎరుపు రంగు.. మనిషి మెదడులో లోతుగా పాతుకుపోయిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుంది. అందుకే.. మహిళలు ముఖ్యమైన సమావేశాలకు ముందు, ఫస్ట్ డేట్‌కు వెళ్లే సమయంలో ఎరుపు రంగు లిప్స్టిక్కు ప్రాధాన్యం ఇస్తారట. అంతేకాకుండా, మనిషి కళ్లు గ్రహించగలిగే అత్యంత ఆకర్షణీయమైన రంగులలో ఎరుపు ముందువరుసలో ఉంటుంది. కాబట్టి, పెద్దపెద్ద మీటింగ్స్, కాన్ఫరెన్స్‌లలో మాట్లాడేటప్పుడు అందరి దృష్టినీ తనవైపు లాగేస్తుంది. ముఖంలోని ఇతర లోపాలను దాచిపెట్టి, మానసిక ధైర్యాన్ని అందిస్తుంది. కార్పొరేట్ ప్రపంచంలోనే కాదు.. రాజకీయాల్లోనూ శక్తిమంతమైన ప్రకటన చేసేటప్పుడు ఎరుపురంగు లిప్‌స్టిక్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.