Armoor | ఆర్మూర్ వ్యవసాయానికి పుట్టినిల్లు. దేశంలోనే ఆదర్శ పల్లెగా పేరొందిన అంకాపూర్ గ్రామం పక్కనే ఉన్నది. అధునాతన వ్యవసాయం, కూరగాయల సాగు , విత్తనోత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరున్నది. పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న సాగులో ముందు వరుసలో ఉన్నది. పూర్వం నవనాథ సిద్ధ్దులు దేశమంతా సంచరిస్తూ ఆర్మూర్‌కు చేరుకున్నారనీ, ఇక్కడి కొండల్లో తపస్సు చేస్తున్న క్రమంలో 9 మంది నవనాథ సిద్ధుల్లోంచి ముగ్గురు ఇక్కడే ఉండి ఆరుగురు వెళ్లిపోయారని ఆరు, మూడు రాను రాను ఆరుమూరు ఆర్మూర్‌గా ప్రసిద్ధి చెందింది.
1952లో ఆవిర్భవించిన ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ గెలుపొందిన వారు రాజకీయంగా ఎదుగుతారని ప్రతీతి. ఉద్యమ సమయంలో అంటే 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. ఉద్యమ నాయకుడిగా ఎదిగిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి.. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు.
తొమ్మిదేండ్లలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రోడ్లు, వంతెనలు, దవాఖానలు, విద్యాలయాలు, కొత్త మండలాలు, ఎత్తిపోతల పథకాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను కలుపుతూ నందిపేట్ మండలం ఉమ్మెడ పాత గ్రామం వద్ద రూ.120 కోట్లతో గోదావరి నదిపై వంతెన నిర్మించారు. 50 సంవత్సరాల క్రితం దూరమైన రెండు ప్రాంతాలు ఎస్సారెస్పీ నిర్మాణంతో వంతెన నిర్మాణంతో దగ్గరయ్యాయి. వెల్మల్, జోర్పూర్, దేగాం వాగులపై నూతన వంతెనలు నిర్మించారు. రూ. 250 కోట్లతో బీటీ, సీసీ రోడ్లను నిర్మించారు.
ఆర్మూర్‌తో పాటు బాల్కొండ నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల కల ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌ను సాకారం చేశారు. డొంకేశ్వర్, ఆలూర్ మండలాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యంగా మారింది. రూ.10 కోట్ల వ్యయంతో మండపాల నిర్మాణం చేపట్టారు.
ఆర్మూర్, నిజామాబాద్ ప్రధాన రోడ్డును ఆనుకొని మాక్లూర్ మండలం పరిధిలోని చిన్నాపూర్ సమీపంలో రూ. 50 కోట్ల వ్యయంతో అర్బన్ పార్కును తీర్చిదిద్దారు. సుమారు 400 ఎకరాల సువిశాలమైన అడవిని పార్కుగా మార్చారు. ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానను 30 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయికి పెంచారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేయించారు.
– ఆర్మూర్, నమస్తే తెలంగాణ