అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy Rains ) పడే అవకాశముందని వాతావరణ శాఖ ( Meteorological Department ) అధికారి జగన్నాథకుమార్ వెల్లడించారు. ముఖ్యంగా ఈనెల 26న వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని, ఈ వాయుగుండం 27న దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు. ఈ ప్రభావం వల్ల కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.
బుధవారం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేశామన్నారు. గురువారం శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూరు గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ , ఈనెల 26 ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నామని వివరించారు.
ఈనెల 27న కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మత్య్యకారులు వేట నుంచి వెనక్కి రావాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో రణస్థలంలో 9 సెం.మీ, మెరకముడిదాంలో 7 , చోడవరం, అనకాపల్లిలో 7 సెం.మీటర్ల వర్షం నమోదయ్యిందని వెల్లడించారు.