Amaravati Farmers | జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం ఇచ్చేది కాదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చి నేటికి 12 ఏళ్లు అవుతుందని వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం పెట్టుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో సీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటున్నాడేమో అని వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు.
జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల సౌకర్యాలు ఏర్పడేవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ రైతులు చేయని త్యాగం అమరావతి రైతులు చేశారని అన్నారు. 33 వేల ఎకరాల భూములు రాజధానికి ఇచ్చారని తెలిపారు. రైతులు చేసిన భూ త్యాగం మరువలేం.. వారికిచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ ఏపీ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హత తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్ ఆధారంగా ఈ ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.