సంగారెడ్డి/ సదాశివపేట, డిసెంబరు 6 : నిషేధిత మత్తు పదార్థాలు రవాణా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నేరాలకు పాల్పడే వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి కటాకటాలకు పంపిస్తున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మధుబాబు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో సోమవారం పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. కంది మండలం చెర్యా ల్ గ్రామంలో నిషేధిత హ్యాషిష్ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరిని, పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద గంజాయి దొరకడంతో ముగ్గురినీ అరెస్ట్ చేశామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలను వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారంతో చెర్యా ల్ గ్రామంలో సోదాలు నిర్వహించగా 55 డబ్బాలలో హ్యాషిష్ ఆయిల్ (ఒక్కొక్క టి 5 గ్రాములు)ను తరలిస్తున్న సాయినాథ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదారాబాద్ వెళుతున్న బస్సును కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామశివారులోని ఇండియన్ దాబా వద్ద తనిఖీ చేయగా రుద్రారం గ్రామ వాస్తవ్యుడు పల్లె మధుకర్ నుంచి 5 గ్రాముల గంజాయి కలిగి ఉన్న 18 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ముగ్గురినీ అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచామని తెలిపారు. హ్యాషిష్ ఆయిల్ రూ.1.70 లక్ష లు, గంజాయి విలువ రూ.3,600ల ఉంటుందని తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలతో పాటు హ్యాషిష్ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నామని సూపరింటెండెంట్ గాయత్రి తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించడం, వినియోగించడం, వాటిని దగ్గర కలిగి ఉన్నా చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సోదాల్లో ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, సిబ్బంది మాణిక్గౌడ్, ప్రభాకర్, శ్రీనివాస్, రాములు, రవీందర్, శ్రావణి, అనిత, జయశ్రీ, అరుణలు పాల్గొన్నారు.
సదాశివపేట వద్ద 992 కిలోల గంజాయి పట్టివేత
992 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సదాశివపేట పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ ఆదివారం జాతీయ రహదారి 65 వై జంక్షన్‌పై తనిఖీలు నిర్వహించగా హారిక పెట్రోల్ పంపు వద్ద మహారాష్ట్రకు చెందిన (ఎంహెచ్18 ఏఏ 7851) లారీలో 496 ప్యాకెట్ల ఎండు గంజాయి ఒక్కొక్కటి రెండు కిలోలు మొత్తం 992 కిలోలను పట్టుకున్నట్లు తెలిపారు. అదే విధంగా లారీకి ముందు పైలెట్‌గా వ్యవహరిస్తూ ముందు ఎవరైనా పోలీసులు ఉన్నారా అనే సమాచారాన్ని అందిస్తూ వస్తున్న ఇన్నోవా కారు (ఎంహెచ్18ఏసీ 0744)ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీలోని గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు తరలిస్తున్నారని వివరించారు. వీరంతా మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన వారని, మాలేగావ్ అన్సార్గంజ్కు చెందిన అల్తాఫ్ ఏ1, లారీ డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ ఖిల్లా రవివర్వార్డు ఏ2, షేక్ అమీన్ పట్కీనారా అబ్బాస్‌నగర్ ఏ3, ముస్తాక్ అహ్మద్ సనావుల్లా నగర్ ఏ4 లను అరెస్టు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఏ5గా ఉన్న ఫిరోజ్ సూచనల మేరకు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఫిరోజ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. అల్తాఫ్ అహ్మద్, షేక్ అమీన్, ముస్తాక్ అహ్మద్‌లకు ముగ్గురికి కలిపి రూ.50వేలు, లారీ డ్రైవర్ అబ్దుల్ రెహమాన్‌కు రూ.50వేలు ఇస్తానని ఫిరోజ్ ఒప్పందం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.99లక్షల20వేలు ఉంటుందని, అల్తాఫ్ నుంచి రూ.7500ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, సాగు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 992 కిలోల గంజాయిని పట్టుకున్న పేట సీఐ సంతోశ్‌కుమార్, ఎస్సై అంబారియా, షరీఫ్, రమేశ్‌లను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోశ్‌కుమార్, ఎస్సై అంబారియా తదితరులు పాల్గొన్నారు.