– నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల
నీలగిరి, ఏప్రిల్ 22 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల లోపు చిన్నారుల మెదడుతో పాటు శారీరక అభివృద్ధికి అరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సాహించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బుధవారం నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయి పోషణ పక్షం కార్యక్రమాన్ని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో మార్పులను గమనిస్తూ ఉండాలన్నారు. పుట్టిన నాటి నుండి మూడు సంవత్సరాల పిల్లల్లో మెదడు అభివృద్ధి, మూడు నుండి ఆరు సంవత్సరాల చిన్నారులకు ఆటల ద్వారా విద్య చెప్పించాలన్నారు. చిన్నారుల్లో మాట, కదలికలు, స్పందన వారి వయస్సు ప్రకారం గమనిస్తూ వారిలో వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరు నెలల వయసులో చిన్నారులు చిరునవ్వుతో తిరగడం, సంవత్సరంలోపు పిల్లలు నడవడానికి ప్రయత్నం చేయడం, రెండు సంవత్సరాలలో వాళ్ళు చిన్న చిన్న మాటలు మాట్లాడటం వంటివి ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు.
ఈ లక్షణాలు లేకపోతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. తల్లిదండ్రులకు పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం, ఆటలు ఆడించడం, ప్రేమగా చూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. టీవీ, మొబైల్ ఎక్కువగా చూపించకుండా ఆటలు వాడేలా అక్షరాలు గుర్తుపట్టేలా వారికి నేర్పించేలా చూడాలన్నారు. చిన్నారులకు మొబైల్ వినియోగం తక్కువగా ఉంచాలని సూచించారు. చిన్నారుల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ కోర్డినేటర్ సతీష్, సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ, మల్లేశ్వరి, లక్ష్మమ్మ, సరస్వతి, మంజూల, పద్మ, వినోదకుమారి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

‘మెదడు, శారీరక అభివృద్ధికి ఆరోగ్యకర ఆహార అలవాట్లను ప్రోత్సహించాలి’