విద్యానగర్, మార్చి 5: శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు సంబంధిత వైద్యులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని పేర్కొన్నారు. వీటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు వరల్డ్ డెంటిస్ట్ డే సందర్భంగా
దంత సంరక్షణపై అవగాహన .. దంతాలు ఎలా ఏర్పడుతాయి..
దంతంపై భాగం ఎనామిల్ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్ తర్వాత డెంటింగ్ అనే మరో పొర ఉంటుంది. డెంటింగ్ తర్వాత పల్స్ కనిపిస్తుంది. ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని దంతాలు ఉంటే అన్ని మూలాల దవడ ఎముకలుంటాయి. దంతాల చుట్టూ చిగురు ఆవరించి ఉండి సిమెంట్లా పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే దంతాలు కూడా అంత గట్టిగా ఉంటాయి. దంతాలను ప్రతి రోజూ శుభ్రం చేసుకోకుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఎదుటివారితో మాట్లాడినప్పుడు వారు తప్పించుకు తిరిగే ప్రమాదం ఉంది. చిగుళ్ల వాపుతో రక్తస్రావం కలుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే దంతాలు ఊడిపోతాయి.
పంటి నొప్పి, చిగురు వాపు వస్తే దంతానికి జండూబాం, అమృతాంజన్ రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్నీసులు పెట్ట కూడదు. పాన్ గుట్కా, పొగాకు ఉత్పత్తులను నములకూడదు. గరుకైన పొడులు, గట్టిగా ఉండే బ్రష్‌ను దంతాలు శుభ్రం చేయడానికి ఉపయోగించవద్దు. అతి చల్లగా, అతి వేడిగా ఉండే పదార్థాలు పంటికి తగలకుండా జాగ్రత్తపడాలి. దంతాలకు వైద్యం చేయించుకుంటే చూపు మందగిస్తుందనడం అపోహ. పంటి నరాలకు కంటి నరాలతో సంబంధమేలేదు. దంతాలు పుచ్చి పోవడానికి కారణం సూక్ష్మ జీవులు. దంతాలు, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రం చేయకపోతే తిన్న ఆహారం దంతాల్లో ఇరుక్కుపోయి చిగుళ్లు వాయడం, రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
దంతాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరు నెలలకోసారి పరీక్షించుకోవాలి. ఏడాదికోసారైనా మెడికల్ క్లీనింగ్ చేయించుకోవాలి. ఓరల్ హైజిన్ లేదా నోటిని శుభ్రం చేసుకుని చికిత్స తీసుకుంటే మంచిది. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. భోజనం చేసిన ప్రతిసారి నోరు పుక్కిలించడం తప్పనిసరి. వైద్యుల సలహామేరకు పుక్కిలించడానికి వాడే మౌత్ వాష్‌ని ఉపయోగించాలి. సరైన బ్రష్‌ని వాడాలి. నోటిలోని అన్ని దంతాలను బ్రష్ చేయాలి. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ముఖంపై చిరునవ్వుకు దోహద పడుతుంది. దంతాలపై బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం, చిగుళ్లు నలుపు రంగులోకి మారడం చిగుళ్ల వ్యాధికి సంబంధించిన జింజివైటీస్ లక్షణం. దీనిని ప్రాథమికంగా నివారించుకోకపోతే పైరియాగా మారుతుంది. దీంతో దంతాలు కుళ్లి పోయే ప్రమాదముంది. వెంటనే దంత వైద్యుడిని సంప్రదిస్తే దంతాల్లో పేరుకున్న గారను తొలగించి, పాలిష్ చేసి దంతంపై సిమెంట్ పెడతారు. ఈ సిమెంట్ భోజనం చేసినప్పుడు మిగిలిన ఆహారం, మ్యూకస్ వలన పేరుకు పోయిన బ్యాక్టీరియా చేరి పాడైపోయే ప్రమాదం ఉంది. ఒకసారి సిమెంట్ పెడితే సమస్య పూర్తిగా పరిష్కారంకాదు.
దంత సమస్యలున్నా, లేకున్నా ఆరు మాసాలకోసారి విధిగా దంత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. నిత్యం ఉదయం, రాత్రి రెండు సార్లు పళ్లు శుభ్రం చేసుకోవాలి. చిగుళ్ల నుంచి రక్తస్రావమైనా, పళ్లపై గార ఏర్పడినా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తే పళ్ల మధ్యలో సిమెంట్ వేసేందుకు అవకాశముంటుంది. రూట్ కెనాల్ వరకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. పళ్లలో ఏమాత్రం నొప్పి వచ్చినా వెంటనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. ప్రస్తుతం దంత వైద్యంలో అనేక రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థిక స్థాయిని బట్టి అవసరమైన చికిత్స చేయించుకోవచ్చు.
– ప్రొఫెసర్ ఈరవేని రణధీర్ (ఎండీఎస్), దంత వైద్య నిపుణుడు, కరీంనగర్