హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ) : దేశంలో కంటి శుక్లం సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుంటున్న 10 శాతం మంది వృద్ధులకు కూడా బీమా వర్తించడంలేదని ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా’ జర్నల్ స్పష్టంచేసింది. బీమాలేని వారిపై ఆర్థిక భారం పడుతున్న తీరును వివరిస్తూ ఓ అధ్యయనంతో కథనం ప్రచురించింది.
తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాల్లో క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్న 70 ఏండ్లు పైబడిన 38,387 మందితో సర్వే నిర్వహించినట్టు పేర్కొంది. ఇందులో 16 శాతం మందికి మాత్రమే బీమా కవరేజీ ఉన్నట్టు తెలిపింది. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు బీమా అవసరమని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ డాక్టర్ బ్రిజేశ్ టక్కర్ తెలిపారు. బీమా ఉంటే సకాలంలో వైద్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.