Friutes | పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో లభించే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లాంటి అనేక పోషకాలు.. శరీరానికి ఎంతో అవసరం. అందుకే.. పండ్లను తింటే ఆరోగ్యం! అయితే, ‘పండ్లను తొక్క తీసి తినాలా? తొక్క సహా తినాలా’ అని చాలామంది సందేహిస్తారు. తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయనీ.. కాబట్టి, తొక్కతో కలిపి తినాలని కొందరి సూచన. రసాయన ఎరువులన్నీ తొక్కపైనే నిలిచి ఉంటాయనీ.. కాబట్టి, దానిని తొలగించాల్సిందేనని మరికొందరి వాదన. ఈ క్రమంలో కొన్ని పండ్లను తొక్క సహా తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ, శుభ్రంగా కడిగి.. తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏయే పండ్ల తొక్కల్లో ఏయే సుగుణాలు ఉంటాయో వివరిస్తున్నారు.
మామిడి పండు : పండ్లలో రారాజు మామిడి. దీని తొక్కలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మామిడి తొక్కలో కెరోటినాయిడ్స్, పాలీఫినాల్స్, ఒమేగా- 3, 6తోపాటు పాలీఅన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలతో పోరాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో మామిడి తొక్క గొప్పగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మామిడికాయలపై కాల్షియం కార్బైడ్ చల్లి.. వాటిని త్వరగా పండేలా చేస్తారు. అలాగే తింటే ఎంతో ప్రమాదకరం. కాబట్టి, ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.
సపోటా: విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పొటాషియం, ఐరన్‌తో నిండి ఉండే సపోటా తొక్క.. పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. చర్మాన్నీ యవ్వనంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది.
యాపిల్ : యాపిల్ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. యాపిల్‌ను తొక్కతో తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది. డయాబెటిక్ రోగులకూ మేలు చేస్తుంది. అల్జీమర్స్‌తో పోరాడే శక్తి లభిస్తుంది. యాపిల్ తొక్కలో ట్రైటెర్పినాయిడ్స్ అనే సమ్మేళనాలు.. క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఖరీదైన యాపిల్ పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండేందుకు కొందరు వ్యాపారులు దీనిపై రసాయనాల పూత పూస్తుంటారు. కాబట్టి, యాపిల్‌ను శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం.
కివీ : ఈ విదేశీ పండు తొక్కలో ఉండే ఫైబర్.. కడుపులో మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాలను తగ్గిస్తుంది. ఈ పండ్లను తొక్కతో తీసుకుంటే.. మూడు రెట్ల ఫైబర్ శరీరానికి అధికంగా అందుతుంది. కివీ పండ్ల గుజ్జుతో పోలిస్తే.. తొక్కలోనే ఎక్కువ యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. కివీ తొక్కలో ఉండే కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు.. నోటిలో చికాకును కలిగిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు తినిపించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
జామకాయలు : వీటిని తొక్కతో తినాలి. జామకాయ తొక్కలో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మినరల్స్ ఉంటాయి.
పీచ్ : పీచ్ తొక్కలో లభించే విటమిన్ ఎ.. కళ్లకు మేలు చేస్తుంది. బరువు తగ్గడానికీ దోహదపడుతుంది.