సాధారణంగానే శీతకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గితుంది. మరీ ముఖ్యంగా గర్భిణులపై చలి తీవ్ర ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గుతోపాటు కీళ్లు పట్టేయడం, పొడిచర్మం వంటి సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. చలికాలంలో గర్భిణులు ఇబ్బంది పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలి వాతావరణం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల.. ఈ కాలంలో గర్భిణులు నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. అయితే, గర్భిణుల్లో డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. శరీరంలో తగినంతగా నీటి స్థాయులు లేకపోతే.. ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పరిస్థితి అలాగే కొనసాగితే.. ముందస్తు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఏ కాలమైనా తగిన మోతాదులో నీళ్లు తాగడం మంచిది.
ఈ కాలంలో చర్మం పొడిబారడం సహజం. ఇక గర్భిణుల్లో పొట్ట పెరిగేకొద్దీ చర్మం సాగుతూ ఉంటుంది. దాంతో చర్మం పగిలి.. ఆ ప్రదేశంలో దురద పెడుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే.. వైద్యుల సూచన మేరకు ప్రత్యేక క్రీములు, లోషన్లు, నూనెలు రాసుకోవాలి. రోజుకు ఒకటి రెండుసార్లు పొట్ట భాగంలో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవడంతోపాటు చర్మం తేమగా ఉంటుంది. ప్రసవం తర్వాత స్ట్రెచ్మార్క్స్ రాకుండా కూడా తోడ్పడుతుంది.
చలికాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. కీళ్లనొప్పులు. చలి గాలులకు శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి.. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దాంతో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. గర్భిణులను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంటుంది. దీనినుంచి బయటపడేందుకు.. వైద్యుల సలహా మేరకు నిపుణుల ఆధ్వర్యంలో ‘అరోమా థెరపీ’ చేయించుకోవడం మంచిది. లావెండర్, టీ ట్రీ, యూకలిప్టస్ వంటి నూనెలతో శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయించుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శారీరక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.