హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అటవీ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు ఎక్కడా చెల్లడం లేదు. వాటిని ఏ ప్రైవేట్ దవాఖానలు అంగీకరించడం లేదు. ఆ ఆరోగ్య కార్డులపై వైద్య సేవలు అందించబోమని, డబ్బులు చెల్లిస్తే వైద్యం మొదలు పెడుతామని కార్పొరేట్ దవాఖానలు కరాకండిగా చెప్తున్నాయి. దీంతో వైద్య ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది వాపోతున్నారు. వారికి ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నప్పటికీ దీని వల్ల వైద్య ఖర్చులన్నీ ముందుగానే చెల్లించాల్సి వస్తున్నది.
అందులో 40-50% సొమ్మును మాత్రమే బీమా కంపెనీలు రీయింబర్స్ చేస్తున్నాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కనీసం అటవీ శాఖ మంత్రి కూడా ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదని తెలంగాణ బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఆరోగ్య కార్డులు చెల్లుబాటయ్యేలా చూడాలని ఆ సంఘం నాయకుడు నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.