ప్రస్తుతం మనదేశంలో చాలామంది యూరిక్ ఆమ్లం సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం వల్ల యూరిక్ ఆమ్లం తయారవుతుంది. ఇది రక్తం ద్వారా కిడ్నీలకు చేరుతుంది. మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. అయితే, యూరిక్ ఆమ్లం మూత్రంలో బయటికి వెళ్లనప్పుడు శరీరంలో దాని పరిమాణం పెరుగుతూ వస్తుంది. దీనివల్ల కీళ్లనొప్పులు వస్తాయి. లేవడం, కూర్చోవడం కష్టమైపోతుంది. దీన్నే గౌట్ అని పిలుస్తారు.
యూరిక్ ఆమ్లం పేరుకోవడం వల్ల గుండెజబ్బులు, అధిక రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, ఆర్థరైటిస్ లాంటి సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి, దీన్ని సరైన సమయంలో గుర్తించి అదుపులో పెట్టుకోవాలి. ఈ దిశగా కాకరకాయ జ్యూస్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆహార విధానంలో ఏవైనా మార్పులు చేసుకోవడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరి.
యూరిక్ ఆమ్లం తగ్గింపులో కాకరలో ఔషధ గుణాలు అపారం. ఓ గ్లాసెడు కాకరకాయ రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయులు సహజంగానే తగ్గిపోతాయి. కాకరలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, బీటా కెరాటిన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి గౌట్ నివారణలో దోహదపడతాయి.
మధుమేహం నియంత్రణలో కూడా కాకరకాయ ఎంతో ప్రయోజనకారి. విటమిన్ ఎ, సి, బీటా కెరాటిన్, ఇతర మినరల్స్, ఫైబర్ వల్ల ఇది ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. రక్తంలో పెరిగే చక్కెర స్థాయుల నిర్వహణలో గొప్పగా ఉపయోగపడుతుంది.
ప్రతిరోజూ పొద్దునే పరగడుపున ఓ సగం కప్పు కాకరకాయ జ్యూస్ తీసుకోవాలి. దీనికి సైంధవ లవణం, లేదంటే నిమ్మరసం కలుపుకొంటే చేదు తగ్గుతుంది. గౌట్, ఆర్థరైటిస్ సమస్యల విషయంలో కాకరకాయ జ్యూస్ మేలుచేస్తుంది. జ్యూస్ ఒక్కటి మాత్రమే కాకుండా, కాకరకాయతో రకరకాల కూరలు చేసుకుని తినడమూ మంచిదే. కాకరకాయ పొడి కూడా తీసుకోవచ్చు. దీనికోసం కాకరకాయను బాగా కడగాలి. ఆ తర్వాత దాన్ని ముక్కలుగా చేసి, నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని నూరి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ పొద్దునే సగం టీస్పూన్ గానీ, టీస్పూన్ గానీ నీళ్లతో కలుపుకొని సేవించాలి.