Masoor Dal | ఎర్ర కందిపప్పును చాలా మంది తరచూ వాడుతూనే ఉంటారు. దీన్నే మైసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మైసూర్ పప్పును చాలా మంది వంటల్లో వాడుతుంటారు. దీంతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఇతర కూరల్లోనూ దీన్ని వేస్తుంటారు. దీంతో కూరలకు చక్కని రుచి వస్తుంది. కొందరు రైస్ వంటకాల తయారీలోనూ మైసూర్ పప్పును ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యకరమైందేనా, ఈ పప్పును తినవచ్చా, దీన్ని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ పప్పును అసలు ఎవరు తినకూడదు.. వంటి విషయాలను పోషకాహార నిపుణులు, వైద్యులు తెలియజేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినని వారు ఈ పప్పును తింటుంటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. శాకాహారులకు ఈ పప్పు ప్రోటీన్లను అందిస్తుంది. ప్రోటీన్ల వల్ల కండరాల కణజాలానికి మరమ్మత్తులు జరుగుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. చక్కని దేహాకృతి సొంతమవుతుంది. శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది. మైసూర్ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ పప్పును తింటే పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
మైసూర్ పప్పు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ పప్పులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మైసూర్ పప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఐరన్ వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. మైసూర్ పప్పులో ఉండే ఫైబర్ కారణంగా దీన్ని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పప్పులో అనేక రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మైసూర్ పప్పును తింటే ఫోలేట్ అధికంగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మెగ్నిషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలను కూడా అధికంగా పొందవచ్చు.
మైసూర్ పప్పును ఎవరైనా సరే తినవచ్చు. దీని వల్ల ఎలాంటి హాని కలగదు. ఇది కూడా ఒక పప్పు జాతికి చెందినదే. అయితే ఏ ఆహారాన్ని అయినా తక్కువగా తినాలనే సామెతగా ఈ పప్పును కూడా మోతాదులోనే తినాలి. అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పప్పుకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే పొటాషియం కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే గౌట్ ఉన్నవారు, ఫైబర్ ఉంటే ఆహారాలు సరిగ్గా జీర్ణం కాని వారు, అలర్జీలు ఉన్నవారు ఈ పప్పును తినకూడదు. లేదంటే చర్మంపై దురదలు వచ్చి ఎరుపు రంగులో దద్దుర్లు ఏర్పడుతాయి. ఇలా మైసూర్ పప్పును పలు జాగ్రత్తలను పాటిస్తూ తరచూ తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.