Unwanted Hair | ముఖం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు తమ అందంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మహిళలు ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి. ముఖంపై కొందరికి అవాంఛిత రోమాలు ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం, మెడిసిన్లను అధికంగా ఉపయోగించడం, వంశ పారంపర్యత, హార్మోన్ల సమస్యలు వంటి కారణాల వల్ల అవాంఛిత రోమాలు వస్తుంటాయి. అయితే ఇందుకు ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలను చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర, నిమ్మరసంతో వాక్సింగ్ చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. సహజసిద్ధమైన పదార్థాలు కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైతం ఉండవు. ఇందుకు గాను 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ నీళ్లను తీసుకోవాలి. చక్కెర, నిమ్మరసం, నీళ్లను కలిపి ఒక చిన్న పాన్‌లో తీసుకోవాలి. దీన్ని సన్నని మంటపై వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మిశ్రమం మారుతుంది. చిక్కని పేస్ట్‌లా ఆ మిశ్రమం మారుతుంది. అనంతరం చల్లార్చి ఆ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే దాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసి పొడిగా అయ్యే వరకు వేచి ఉండాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై ఒక దట్టమైన పొరలా రాయాలి. వెంట్రుకలు పెరిగే దిక్కుగా ఈ మిశ్రమాన్ని రాయాల్సి ఉంటుంది. అనంతరం ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని దాన్ని ముందుగా రాసిన మిశ్రమంపై వేసి చక్కగా పరుచుకునేట్లు గట్టిగా ఒత్తిడి కలిగించాలి. తరువాత చర్మాన్ని గట్టిగా పట్టుకుని ఆ క్లాత్‌ను తీసేయాలి. ఈ చిట్కాను ప్రతి 2 లేదా 3 వారాలకు ఒకసారి పాటిస్తుంటే ఉపయోగం ఉంటుంది.
అవాంఛిత రోమాలను తొలగించడంలో శనగపిండి, పసుపు కూడా పనిచేస్తాయి. ఇవి కూడా సహజసిద్ధమైనవే కనుక ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి, 1 టీస్పూన్ పసుపు, తగినన్ని నీళ్లు లేదా పాలను తీసుకుని బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. బాగా పొడిగా అయ్యే వరకు సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు వేచి ఉండాలి. పొడిగా అయ్యాక నీళ్లతో స్క్రబ్ చేస్తూ నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని తొలగించాలి. ఈ చిట్కాను పాటించడం తేలిక కనుక వారంలో 2 లేదా 3 సార్లు పాటించవచ్చు. దీన్ని పాటిస్తున్నా కూడా అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
ఆలుగడ్డలు, ఎర్ర కందిపప్పులను వాడుతున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇందుకు గాను 1 ఆలుగడ్డను, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కంది పప్పు పేస్ట్‌ను, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆలుగడ్డను పొట్టు తీసి దాని నుంచి రసం తీయాలి. ముందు రోజు రాత్రి పూట ఎర్ర కందిపప్పును నీటిలో నానబెట్టి మరుసటి రోజు దాన్ని మెత్తని పేస్ట్‌లా మార్చాలి. ఆలుగడ్డల రసం, ఎర్ర కంది పప్పు పేస్ట్, తేనె, నిమ్మరసం అన్నింటినీ కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై రాసి 15 నుంచి 20 నిమిషాల వరకు పొడిగా అయ్యే వరకు వేచి ఉండాలి. అనంతరం వేళ్లతో నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని తీసేయాలి. తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తున్నా కూడా అవాంఛిత రోమాల సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.