ఉప్పల్, జనవరి 16 : అన్న దమ్ములు మద్యం తాగుతూ గొడవ పడటంతో ఒకరి ప్రాణం పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని వీఎస్టీ కాలనీలో నివసించే అన్నదమ్ములు గురువారం అర్ధరాత్రి మూడో అంతస్తులో మద్యం తాగుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ జరిగింది. దీంతో లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ తన సోదరుడైన స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ను మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ను శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.