వాషింగ్టన్: వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అందచేశారు. నోబెల్ శాంతి బహుమతి కోసం తపించుకుపోయి గత ఏడాది తన కోరికను బహిరంగంగా బయటపెట్టుకున్న ట్రంప్ చివరకు ఈ రకంగా శాంతి బహుమతిని సాధించుకున్నారు. మచాడో చేతి నుంచి నోబెల్ శాంతి బహుమతి సర్టిఫికెట్‌ను స్వీకరిస్తూ ఆనందాన్ని దాచుకోలేకపోయిన ట్రంప్ ఇదో అద్భుతమైన ప్రతీకాత్మక చర్యగా అభివర్ణించారు.
ట్రంప్‌నకు శాంతి బహుమతిని బహూకరించిన మచాడో ఆ మెడల్ని వైట్‌హౌస్‌లోనే వదిలిపెట్టారు. ఆమె ఇచ్చిన బహుమతిని ఆనందంగా స్వీకరించిన ట్రంప్ ఇది పరస్పర గౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత తనకు లభించిన పురస్కారాన్ని స్వచ్ఛందంగా మరో వ్యక్తికి అందచేయడం ఇదే తొలిసారి. అయితే ఒకరికిచ్చిన అవార్డును మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతున్నది. దీనికి నార్వేజియన్ నోబెల్ సంస్థ కొద్ది రోజుల ముందే సమాధానం ఇచ్చింది. నోబెల్ బహుమతిని బదిలీ చేయడం, పంచుకోవడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది.