న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ స్వదేశ్’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది. ప్రస్తుతం ఇరాన్లో 10 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఇందులో విద్యార్ధులు, వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2,500-3000 మంది విద్యార్థులు అక్కడ మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్నారు.
కాగా, ముందు జాగ్రత్త చర్యగా ఇరాన్‌కు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని కేంద్ర విదేశాంగ శాఖ మన ప్రజలకు అడ్వైజరీ జారీ చేసింది. తమ పూర్తి వివరాలు, పాస్‌పోర్టులను భారత ఎంబసీ సేకరించిందని, శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్‌ను తరలిస్తాం సిద్ధంగా ఉండమని చెప్పిందని, జమ్ము కశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్ తెలిపింది. కాగా, ఇరాన్లో జరుగుతున్న అల్లర్లలో ఇప్పటివరకు 2,550 మంది మరణించారని, అందులో 2,403 మంది ఆందోళనకారులు, 147 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని మానవ హక్కుల ఏజెన్సీ ఒకటి వెల్లడించింది.