ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. చరిత్రాత్మక వెయ్యో వన్డేలో విజయం సాధించింది. స్పిన్నర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో రోహిత్ సేన అలవోకగా నెగ్గింది. క్రికెట్ వీరాభిమాని, గాన కోకిల లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లతో మైదానంలోకి దిగిన భారత జట్టు.. ఘనవిజయంతో దిగ్గజ గాయనికి నివాళులర్పించింది! కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో స్వదేశీ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించిన టీమ్ఇండియా.. బుధవారం రెండో వన్డే బరిలో దిగనుంది.
అహ్మదాబాద్: చారిత్రక వన్డేలో భారత జట్టు అద్వితీయ ఆటతో అభిమానులను అలరించింది. మొదట స్పిన్నర్లు తమ మ్యాజిక్‌తో కరీబియన్లకు కళ్లెం వేస్తే.. ఆనక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించేశాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్రమోదీ మైదానంలో జరిగిన పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. తద్వారా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) ధాటికి టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ (57; 4 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా.. పొలార్డ్ (0), హోప్ (8), పూరన్ (18), బ్రావో (18), బ్రూక్స్ (12), బ్రాండన్ కింగ్ (13) విఫలమయ్యారు. ఒక దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును మాజీ కెప్టెన్ హోల్డర్ ఆదుకున్నాడు. ఫాబియన్ అలెన్ (29) అండగా పోరాడే స్కోరు అందించాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించడం విశేషం. హైదరాబాదీ వికెట్ల ఖాతా తెరువగా.. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. పూరన్ వికెట్ పడగొట్టడం ద్వారా చాహల్ వన్డేల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అనంతరం సులభతరమైన లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ (51 బంతుల్లో 60; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్), అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడా (26 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
విజయంతో మొదలు
గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రోహిత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మంచి బంతులను గౌరవించిన హిట్‌మ్యాన్ చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్‌ను ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ.. చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. అల్జారీ జోసెఫ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన రోహిత్ నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. వచ్చీరాగానే విరాట్ కోహ్లీ రెండు బౌండ్రీలు బాదాడు. అల్జారీ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే గల్లీలో నుంచి బౌండ్రీకి తరలించిన విరాట్.. రెండో బంతికి 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సూపర్‌ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు సచిన్ టెండూల్కర్ సిక్సర్ రుచి చూపించినట్లు అప్పర్ కట్ ద్వారా బౌండ్రీ రాబట్టాడు. అయితే అదే జోష్‌లో తర్వాతి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోచ్‌కు చిక్కాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. యుజ్వేంద్ర చాహల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడే రెండవన్డేజరుగనుంది.
నల్లరిబ్బన్లతో..
గాన కోకిల లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా తొలి వన్డేలో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన లతా దీదీ మృతికి సంతాపంగా.. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
దీపక్ హుడా అరంగేట్రం
దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడాకు ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కింది. వ్యక్తిగత కారణాల వల్ల లోకేశ్ రాహుల్ తొలి వన్డేకు దూరం కావడం.. శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కరోనా బారిన పడటంతో దీపక్ హుడా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దీపక్ హుడాకు వన్డే క్యాప్ అందించాడు.
స్కోరు బోర్డు
వెస్టిండీస్: హోప్ (బి) సిరాజ్ 8, కింగ్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 13, బ్రావో (ఎల్బీ) సుందర్ 18, బ్రూక్స్ (సి) పంత్ (బి) చాహల్ 12, పూరన్ (ఎల్బీ) చాహల్ 18, పొలార్డ్ (బి) చాహల్ 0, హోల్డర్ (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 57, అకీల్ (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 0, అలెన్ (సి అండ్ బి) సుందర్ 29, జోసెఫ్ (సి) సూర్యకుమార్ (బి) చాహల్ 13, రోచ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 43.5 ఓవర్లలో 176 ఆలౌట్. వికెట్ల పతనం: 1-13, 2-44, 3-45, 4-71, 5-71, 6-78, 7-79, 8-157, 9-167, 10-176, బౌలింగ్: సిరాజ్ 8-2-26-1, ప్రసిద్ధ్ కృష్ణ 10-0-29-2, సుందర్ 9-1-30-3, శార్దూల్ 7-0-38-0, చాహల్ 9.5-0-49-4.
భారత్: రోహిత్ (ఎల్బీ) జోసెఫ్ 60, ఇషాన్ (సి) అలెన్ (బి) అకీల్ 28, కోహ్లీ (సి) రోచ్ (బి) జోసెఫ్ 8, పంత్ (రనౌట్/జోసెఫ్) 11, సూర్యకుమార్ (నాటౌట్) 34, దీపక్ హుడా (నాటౌట్) 26, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 28 ఓవర్లలో 178/4. వికెట్ల పతనం: 1-84, 2-93, 3-115, 4-116, బౌలింగ్: రోచ్ 5-0-41-0, హోల్డర్ 5-0-29-0, జోసెఫ్ 7-0-45-2, అకీల్ 9-0-46-1, అలెన్ 2-0-14-0.