హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నివసిస్తూ, ఇకడే ఇండ్లు, వ్యాపారాలు, వృత్తిపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలువురు ఓటు హకు విషయానికి వచ్చేసరికి సొంత ప్రాంతాలకే మొగ్గుచూపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖుల్లో చాలామంది దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. తమ వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎకువ సమయం హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. అయితే ఓటు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది సొంత ఊరినే ఎంచుకున్నట్టు ‘సర్’ సందర్భంగా వెలుగుచూసిన గణాంకాలు చెప్తున్నాయి.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో సినీ ప్రముఖులు కొన్నేండ్లుగా ఉంటున్నారు. 2026 జూన్ 10వ తేదీనాటికి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 6,35,283 మంది ఉండగా, వీరిలో 1,32,063 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్టు బీఎల్వోలు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లో 4,06,729 మంది ఓటర్లకుగాను 1,48,859 మంది, ఖైరతాబాద్‌లో 2,93,667 మందికిగాను 95,082 మంది తరలివెళ్లినట్టు గుర్తించారు. ఈ లెక్కన మూడు నియోజకవర్గాల్లో కలిపి మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు తగ్గారు. అయితే, ఇందులో ఎంత మంది సినీ ప్రముఖులు ఉన్నారనేది మాత్రం తెలియడం లేదు. పలువురు ప్రముఖులు తమ స్వస్థలాల్లో వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కలిగి ఉండటం వల్ల అకడ ఓటు హకు కొనసాగించాలనుకున్నారని అధికారులు చెప్తున్నారు.