Health tips : సాధారణంగా పండు ఏదైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే పండువల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్రయోజనాలు కొన్ని పండ్లలో ఎక్కువగా, కొన్ని పండ్లలో తక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పండ్లలో పంపర పనస ఒకటి. ఈ పంపర పనస పండు అచ్చం బత్తాయిని పోలి, పరిమాణంలో కొంత పెద్దగా ఉంటుంది. పండు లోపల నిమ్మ, నారింజ, బత్తాయిలాగానే తొనలు ఉంటాయి. సిట్రస్ జాతికి చెందిన ఈ పండు కలర్ ఫుల్‌గా కనిపించడమే కాకుండా మంచి ఆరోగ్య లక్షణాలను కూడా కలిగి ఉంది. పంపర పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
పంపర పనసలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఈ పండును తింటుంటే అనారోగ్యాలు దరిచేరవు.
పంపర పనసలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సంబంధ సమస్యలు సహజగానే అదుపులో ఉంటాయి. ఇక ఈ పండులోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.
జీర్ణక్రియకు సాయపడే జీర్ణ ఎంజైమ్‌లు కూడా పంపర పనసలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు తరచూ తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.
పంపర పనస రుచిలో తియ్యగా ఉన్నప్పటికీ దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తీపి తినాలనే వారికి ఇది తృప్తిని ఇస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు పంపర పనస తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
ఈ పండులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సాయపడుతాయి. ఈ పండును రెగ్యులర్‌గా తీసుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుంది.