వనపర్తి, జనవరి 3 : వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. రోజురోజుకూ జిల్లాను దాటి రాష్ట్ర రాజధానికి చేరింది. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి వ్యవహార శైలి నచ్చని పార్టీ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ డెలిగేట్ శంకర్‌ప్రసాద్, మాజీ పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీశ్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో కాంగ్రెస్ బతకాలంటే చిన్నారెడ్డిని తొలగించాల్సిందేనని పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉంటూ క్రమశిక్షణ లేకుండా సీనియర్లందరినీ పక్కన పెడుతూ అవమానిస్తున్నారని చెప్పారు. చిన్నారెడ్డి 45 ఏండ్లుగా ఒక్కడే వనపర్తిలో సీటు కావాలంటూ జనానికి విసుగు తెప్పించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నారెడ్డిని కచ్చితంగా తప్పించాలని, లేకుంటే గాంధీభవన్ ముందే టెంట్ వేసుకుని కూర్చుంటామని కరాఖండిగా నాయకులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వనపర్తిలో హస్తం పార్టీ బతకాలంటే చిన్నారెడ్డిని తప్పించాలన్న నినాదాలు జోరందుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, సోలీపూర్ రవీందర్ రెడ్డి, కొత్తకోట మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, సీనియర్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి, కొండన్న, శ్రీహరిరాజు, మర్రికుంట సురేశ్, రాములు, మురళీగౌడ్, కురుమూర్తి, నాగరాజుతో పాటు మండల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.