తిరువనంతపురం: మహిళల వన్డే ప్రపంచకప్ వంటి చిరస్మరణీయ విజయం తర్వాత స్వదేశంలో తొలి సిరీస్ ఆడిన భారత జట్టు.. ఈ ఏడాదిని ఘనవిజయంతో ముగించింది. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో లంకను 15 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68, 9 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌తో పాటు బంతితో (1/16)నూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఛేదనలో లంక.. 20 ఓవర్లకు 160/7 వద్దే పరిమితమై సిరీస్‌లో వైట్‌వాష్‌ను మూటగట్టుకుంది. ఓపెనర్ హాసిని పెరీర (42 బంతుల్లో 65, 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేష దులాని (39 బంతుల్లో 50, 8 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆదుకున్నా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారత్‌కు ఇది మూడో సిరీస్ వైట్‌వాష్ కావడం విశేషం.
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు టాపార్డర్ విఫలమైనా హర్మన్‌ప్రీత్ ఆకట్టుకుంది. ఒకదశలో 77/5తో నిలిచిన భారత్.. మ్యాచ్‌ను కాపాడుకునే స్కోరు (175) చేసిందంటే అది హర్మన్‌ప్రీత్‌తో పాటు ఆఖర్లో అరుంధతి మెరుపుల చలవే. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో జోరుమీదున్న షెఫాలీ (5) రెండో ఓవర్లోనే నిష్క్రమించగా అరంగేట్ర కమిలిని (12) కూడా కవిష ఐదో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయింది. హర్లీన్ (13)ను రష్మిక బౌల్డ్ చేసింది.
రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7)ని ఆటపట్టు పెవిలియన్‌కు పంపడంతో 11 ఓవర్లలో 79/5తో నిలిచింది. టాపార్డర్ చేతులెత్తేసినా ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్.. ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడింది. ఇనొక 8వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన ఆమె.. మధ్యలో కాస్త నెమ్మదించినా అమన్‌జ్యోత్ (18 బంతుల్లో 21, 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి 37 బంతుల్లోనే 61 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఆటపట్టు 15వ ఓవర్లో రెండు ఫోర్లతో టీ20ల్లో 15వ అర్ధ శతకం పూర్తిచేసింది. ఆఖర్లో ధాటిగా ఆడే క్రమంలో ఆమె వికెట్ కోల్పోయినా చివరి ఓవర్లో అరుంధతి.. 4, 6, 4, 4తో రెచ్చిపోవడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది.
హాసిని, ఇమేష పోరాడినా..
ఛేదనలో లంక రెండో ఓవర్లోనే కెప్టెన్ ఆటపట్టు (2) వికెట్ కోల్పోయినా ఓపెనర్ హాసిని, ఇమేష భారత బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కున్నారు. రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అమన్‌జ్యోత్ 12వ ఓవర్లో విడదీసింది. ఆ తర్వాత నీలాక్షి (3), కవిష (5) వెంటనే ఔట్ అయినా ధాటిగా ఆడిన హాసినిని చరణి క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 175/5 (హర్మన్‌ప్రీత్ 68, అరుంధతి 27, కవిష 2/11, ఆటపట్టు 2/21); శ్రీలంక: 20 ఓవర్లలో 160/7 (హాసిని 65, ఇమేష 50, అరుంధతి 1/16, అమన్‌జ్యోత్ 1/17)