హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసింది. పచ్చద నం పెంచే బృహత్తర లక్ష్యంతో అద్భుతమైన ఫలితాలు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు గెల్చుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్యక్రమం పేరును వనమహోత్సవంగా మార్చి, అలసత్వం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో అధికారు లు మొక్కుబడిగా అమలు చేస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఈ వర్షాకాలంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా మొదలు పెట్టిన వనమహోత్సవంలో 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 13.84 కోట్లు మాత్రమే నాటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల ప్రకటించారు.
మరో 4.20 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలం రాకముందే సన్నాహాలు పూర్తి చేసి, వర్షాలు పడగానే మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగేవని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. లక్ష్యానికి మించి మొక్క లు నాటిన సంవత్సరాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు పర్యావరణంపై చిత్తశుద్ధిలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షాకాలం ముగుస్తుంటే మొక్కలు ఎప్పుడు నాటుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి పచ్చదనం పెంపుపై పట్టింపులేదని మండిపడుతున్నారు.