
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆయన పేరు వేముగంటి రఘురామరావు. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు పచ్చని మొక్కలే నేస్తాలు. యూనివర్సిటీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆయన ధ్యాసంతా మొక్కలపైనే. ఉప్పల్‌లో చిన్నపాటి చిత్ర అపార్ట్మెంట్ ఉండే ఆయన తన ఇంటిని పచ్చని పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నాడు. ఇంటితో పాటు అపార్ట్మెంట్ పరిసరాలు, కాలనీ రహదారులను ఆయన పచ్చదనంతో నింపేశారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. మొక్క నాటాలనే తాపత్రయం ఆయన సొంతం. పచ్చదనం కోసం పరితపిస్తూ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలనే దృఢ సంకల్పంతో అనుక్షణం కష్టపడుతున్న పర్యావరణ స్వాప్నికుడు, హరిత కాలనీ ప్రేమికుడు రఘురామరావును నమస్తే తెలంగాణ పలుకరించింది.
ఆకుపచ్చ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ స్ఫూర్తితో పర్యావరణ రక్షణను తన వంతు బాధ్యతగా చేస్తున్నాను అంటారు రఘురామరావు. తన వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ హరిత కాలనీని, పచ్చని పొదరిల్లును తీర్చిదిద్దారు. ఆయన ఇప్పటి వరకు 10వేల వరకు మొక్కలు నాటానని చెప్పారు. ఓయూ ప్రొఫెసర్లతో కలిసి క్యాంపస్ ప్రాంగణంలో 100 టేకు మొక్కలను నాటామన్నారు. ఒక్క మొక్కనూ వృథా చేయొద్దనే ఉద్దేశ్యంతోనే రోడ్ల వెంట వెళుతుంటే వృథాగా పడేసిన మొక్కలు కనిపించినా.. అక్కడే చిన్నపాటి గుంత తీసి ప్రాణంపోస్తారు. హరితకాలనీ చుట్టూ గోడలపై హరిత వనాలను పెంపొందించే నినాదాలతో పాటు, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలంటూ తన సొంత ఖర్చులతో నినాదాలు రాయించారు.
చిత్ర అపార్ట్మెంట్ ప్రాంగణంలో పండ్ల మొక్కలు పలుకరిస్తాయి. ఉసిరి, అరటి, జామ, దానిమ్మ, సీతాఫలం, మామిడి, అల్లనేరేడు, అంజీర్, చిటి ఉసిరి, బొప్పాయి, సనస, సపోట వంటి పండ్ల మొక్కలు పలుకరిస్తున్నాయి. పారిజాతం, సంపెంగ, మల్లె, మందారం, ఎలిఫెంట్ మందాం, రెక్క మందారం, వేయివరహాలు, స్వస్తికం, అడవి గన్నేరు లాంటి అనేక పూల మొక్కలు అలరిస్తుంటాయి.
ఇంటి ప్రాంగణంలో అనేక అరుదైన మొక్కలు దర్శనమిస్తాయి. జమ్మిచెట్టు, పూలతో అల్లుకునే దవనం, మునగ, వెదురు, సిల్వర్ ఓక్, టేకు, మేడి, కరివేపాకు, వాము, ఆముదం, నల్లారం, తిప్పతీగ, సర్కార్ తీగ, బొబ్బర్లు, 12 రకాల కర్జూరం చెట్లు ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాల మొక్కలు ఆయన ఇంటి ఆవరణలో దర్శనమిస్తాయి. మార్కెట్లోకి ఏఒక్క కొత్తరకం మొక్క వచ్చినా దానిని తెచ్చుకుంటారు.
వేముగంటి రఘురామరావు పదేండ్లుగా ప్లాస్టిక్ మహమ్మారిని నిర్మూలించాలని పోరాటం చేస్తున్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల ఒక ఆవు చనిపోయినట్లు తెలుసుకున్న ఆయన తన పిల్లలను ప్లాస్టిక్‌కు దూరంగా ఉంచాలనుకున్నారు. ప్లాస్టిక్ మనల్ని చిన్నాభిన్నం చేయకముందే.. ఆ భూతాన్ని మనం తరిమేయాలని అంటారు. ఆలోచనల్లోనే కాదు ఆచరణలోనూ ముందుండాలని చెప్పే ఆయన ఏడాది క్రితం వాళ్ల పెద్దమ్మాయి పెండ్లిని ప్లాస్టిక్ రహితంగా చేశారు. ప్లేట్లు, గ్లాసులు మొదలుకొని సింగిల్ ప్లాస్టిక్ వస్తువును కూడా ఉపయోగించలేదు. అది చూసిన పెళ్లివారు ఆయన చిత్తశుద్ధికి ముగ్ధులయిపోయారు. ఇలా ఒక్కొక్కరుగా ప్లాస్టిక్‌పై పోరాటం చేస్తేనే భవిష్యత్తరాలకు సహజసంపదలతో కూడిన నిండైన బతుకు భరోసాను నింపగలుగుతామని రఘురామ రావు విశ్వాసం చెబుతున్నారు.