సిద్దిపేట, జూలై 9 : కాళేశ్వరం నుంచి వచ్చే పారే గోదావరి జలాలు ప్రజల కండ్ల కు కనిపిస్తున్నా, సీఎం రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం కనిపించడం లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. గురువారం సిద్దిపేటలో క్యాంప్ కార్యాలయంలో తన ఓటరు ఎన్యుమరేషన్ పత్రా న్ని స్వయంగా నింపి బీఎల్వోకు అందజేశారు. ప్రతి ఒకరూ బాధ్యతగా తమ ఓటరు ఎన్యుమరేషన్ పత్రాన్ని నింపి, ఈ నెల 24లోగా సంబంధిత అధికారులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం చిన్నకోడూర్ మండల పర్యటనలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడం వల్లే 6లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు నిండిపోయి, తరలించేందుకు కనీ సం లారీలు కూడా దొరుకని పరిస్థితి వ చ్చిందని పేర్కొన్నారు.
నిత్యం కాలువలు, కెనాళ్ల ద్వారా ప్రజలకు సాగు, తాగునీరు అందుతుంటే రేవంత్‌రెడ్డి మాత్రం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన ఆవసరం ఉన్నదని చెప్పారు. గురుకులాల్లో కోడిగుడ్లతో మొదలుకొని విద్యార్థులు వేసుకొనే బూట్లు, యూనిఫామ్‌లు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదాంట్లో కమిషన్లేనని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మకజొన్న రైతుకు కనీసం నాలుగు బస్తాలు ఇవ్వాలని కానీ ప్రభుత్వం రెండు బస్తాలే ఇస్తామని సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల రైతులకు పెనుభారమైందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే యాప్ రద్దు చేయాలని, యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.