క్యాతనపల్లి, జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్ లైవ్‌లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనలపై గవర్నర్ నివేదిక తెప్పించుకొని మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, ఎన్నికల కమిషన్‌పై చర్యలు తీసుకోవాలి.
– హరీశ్‌రావు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ) : క్యాతనపల్లి ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో పాటు ఇతర నాయకులను బీఆర్ఎస్ నేతలు జోగు రామన్న, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, నాయకులు జీవన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. క్యాతనపల్లి, జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే లైవ్‌లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా అని ప్రశ్నించారు. ఈసీ విధులు సరిగా నిర్వహించకపోతే ఎన్నికలు పెట్టి ఏం ప్రయోజనం? అని మండిపడ్డారు. ఈ ఘటనలపై గవర్నర్ సమగ్ర నివేదిక తెప్పించుకొని ఎన్నికల్లో రా జ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, ఎన్నికల కమిషన్‌పై రివ్యూ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి వినాశకాలం దాపురించిందని, తగిన మూల్యం చేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే చరఖా తిప్పుతూ గాంధేయవాదిగా చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఎందుకు స్పందించడం లేదని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు మీ గాంధేయవాదం ఏమైందని మండిపడ్డారు. ఓటరు తీర్పును కాదని పోలీసు లాఠీని నమ్ముకొని కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇప్పుడు మీ రాజ్యాంగం ఏమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాతనపల్లి ప్రజలు 14 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించి, కాంగ్రెస్‌ను కేవలం 7 స్థానాలకు పరిమితం చేసినా మంత్రి వివేక్ ప్రజాతీర్పును కాలరాసి రాజకీయం చేస్తుంటే ఎన్నికల ప్రక్రియ ఎందుకు జరుపుతున్నారంటూ నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరించేందుకు పోలీసు కవాతు నిర్వహించారని హరీశ్‌రావు విమర్శించారు. ఎక్కడైనా ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు పోలీసు కవాతు చేస్తారని జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, తొర్రూరు, క్యాతనపల్లిలో మాత్రం బీఆర్ఎస్ నాయకులను భయపెట్టి.. ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ నాయకులు గొడవ చే సి ఎన్నిక వాయిదా వేయించారని, జనగామలో బీఆర్ఎస్ కౌన్సిలర్ చేయి ఎత్తితే లోపల ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతిని లాగారని, ఇదంతా యూ ట్యాబ్‌లో లైవ్‌లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. వరంగల్ కార్పొరేషన్లో ఓటు నమోదు చేసుకొన్న అక్కడి ఎంపీ, తొర్రూరులో ఓటు ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఏ నాయకుడైనా శిరసా వహించాలని లేకపోతే తిరుగుబాటు తప్పదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. క్యాతనపల్లిలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యవహరించారని దుయ్యబట్టారు. కౌన్సిల్ వాయిదా వేయవద్దని ఎన్నికలు జరుపాలని కోరినా వినకుండా మంత్రి వివేక్ కనుసన్నల్లో అధికారులు చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కౌన్సిల్ హాల్లోకి అనుమతించని పోలీసులు, మంత్రి వివేక్ కాన్వాయ్‌ను ఎలా పంపించారని ప్రశ్నించారు. దీనిని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై రాళ్లతో దాడి చేశారని, అన్యాయంగా బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్‌పై కేసులు పెట్టారని మండిపడ్డారు. రామగుండం, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నా పోలీసులు కావాలని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తరలించారని విమర్శించారు.
చట్టాన్ని అతిక్రమించి, పరిధి దాటి అతిగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. అధికారం శాశ్వతం కాదని, పోస్టింగ్‌లు, ఇతర వాటి కోసం తప్పులు చేస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని, దీనిని బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని రేవంత్‌రెడ్డి, వివేక్‌లు ఎవరూ కాపాడలేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆ పార్టీల నేతల మధ్య మైత్రి స్పష్టంగా కనిపిస్తున్నదని, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో వారి కలయికను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, హక్కుల గురించి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎస్సీ, ఎస్టీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పోలీసులు బాల్క సుమన్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి అన్నం పెట్టకుండా, మంచినీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల తమ నాయకుడిని కలిసేందుకు చర్లపల్లి జైలుకు వెళ్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలో ఉన్న పిల్లలకు మెస్ బిల్లులు రావడం లేదని, జైలులో ఉన్న ఖైదీలకు మెస్ బిల్లులు రావడం లేదని చెప్పారని వివరించారు.
చట్టాన్ని అతిక్రమించి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కృషిచేసిన బాల్క సుమన్‌ను అక్రమంగా జైలులో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీ సు అధికారిని బూతులు తిట్టారని, బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను తన్నుకుంటూ తీసుకురండి అని బెదిరించారించారని, వారిపై ఆలస్యంగా కేసులు పెట్టినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తెలిపారు. బాల్క సుమన్‌తో పాటు అరెస్ట్ చేసిన మిగ తా వారి కుటుంబసభ్యులకు పోలీసులు కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పోలీస్ ప్రతిష్టను పెంచిందని తెలిపారు.
ప్రజల ఆమోదాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమంగా పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చైర్మన్ పదవులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలిచిందని, ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ 30శాతం ఓటు బ్యాంకు తెచ్చుకున్నదని, 800మంది కౌన్సిలర్లు విజయం సాధించారని చెప్పారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని, మంత్రి వివేక్ సమక్షం లో మహిళా కౌన్సిలర్ల గౌరవానికి భంగం వాటిల్లితే పోలీసులు ఫిర్యాదు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. మూల రాజిరెడ్డి కారు ధ్వంసమైనా ఫిర్యాదు తీసుకోకుండా, బీఆర్ఎస్ నేతలపైనే అక్రమ కేసులు పెట్టారని విరుచుకుపడ్డారు.
సింగరేణి ప్రాంతమైన క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రజలు ఓడించి, బీఆర్ఎస్కు పట్టం కట్టారని హరీశ్‌రావు పేర్కొన్నారు. సింగరేణిని కాంగ్రెస్ బంగారుబాతుగా మార్చి దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బాల్క సుమన్ అరెస్ట్ విషయంలో జిల్లా కోర్టుతో పాటు అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని వెల్లడించారు. వాస్తవాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకుపోతామని, న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉన్నదని తెలిపారు. బాల్క సుమన్‌కు పోరాటాలు కొత్తకాదని, విద్యార్థి సంఘం నాయకుడిగా సమైక్యవాదులపై పోరాడారని గుర్తుచేశారు. దళిత నాయకుడైన సుమన్‌పై రేవంత్‌రెడ్డి పగతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.