న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో అమెరికా సైన్యం భారీగా మోహరించిన నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్ మాత్రం అణు కార్యక్రమంపై ఈ నెల 17న(మంగళవారం) జెనీవాలో అమెరికాతో జరిగిన పరోక్ష చర్చలలో మంచి పురోగతి ఉన్నట్లు వెల్లడించింది.
ఈ వారాంతంలో ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికన్ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్‌కు తెలియచేయగా అటువంటి సైనిక చర్యకు అనుమతించే విషయమై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇరాన్‌పై ఉత్తమ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవలసిందిగా తన సలహాదారులు, మిత్రులను ట్రంప్ కోరినట్లు వార్తా సంస్థ వివరించింది. ఉన్నతస్థాయి భద్రతాధికారులు బుధవారం(ఫిబ్రవరి 18) వైట్‌హౌస్‌లోని సిట్యువేషన్ రూములో సమావేశమైనట్లు ఈ సమావేశానికి హాజరైన ఓ వ్యక్తి పేర్కొన్నట్లు సీఎన్ఎన్ తెలిపింది.
అంతకుముందు రోజు జరిగిన పరోక్ష చర్చల గురించి ట్రంప్‌నకు ఆయన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జేరెడ్ కుష్నర్ వివరించారు. ఇరాన్‌పై దాడి జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తన సిబ్బందిలో కొందరిని పెంటగాన్(అమరికన్ సైనిక ప్రధాన కార్యాలయం) తాత్కాలికంగా తరలిస్తున్నట్లు సీఎన్ఎన్ న్యూస్ ఇదివరకే వెల్లడించింది.