రామచంద్రాపురం, సెప్టెంబర్ 6: బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జి. ఎల్లయ్య అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన పార్థివదేహాన్ని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ మున్సిపల్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో ఉన్న ఆయన నివాసానికి కార్మికులు, అభిమానుల సందర్శనార్థం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎల్లయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు దుబ్బాక, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతాప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, కాట శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, ఐఎస్టీయూసీ నాయకుడు రెహమాన్, దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్, కార్మిక నాయకుడు మోహన్‌గౌడ్, కార్మిక నేత కొల్లూరి సత్తయ్య ఎల్లయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు.
కార్మికులు, ప్రజాప్రతినిధులు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎల్లయ్యకు నివాళులర్పించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్మిక నేతను చివరిసారిగా చూసి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, కార్మిక నేత, ఎల్లయ్య మరణం కార్మిక లోకానికి తీరని లోటని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో పోరాడిన ఏకైక వ్యక్తి ఎల్లయ్య అని కొనియాడారు.
ఎల్లయ్య జీవితం మొత్తం కార్మికుల పక్షపాతిగా సాగిందని, ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శప్రాయుడన్నారు. ఎల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు తెలిపారు. అనంతరం కార్మిక నేత ఎల్లయ్య అంత్యక్రియలను ఆర్సీపురంలోని హిందూ శ్మశాన వాటికలో అతడి కుటుంబ సభ్యులు నిర్వహించారు.