హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలను ఆయన ఎండగొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడు సీజన్లలో రైతు భరోసాను ఎగ్గింటిందని అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు ఎన్నికల అజెండాలో కూడా పెట్టారని హరీష్‌రావు గుర్తుచేశారు. తొలి బడ్జెట్లో ప్రకటించి, ఆ తర్వాత దాన్ని రూ.12 వేలకు తగ్గించారని మండిపడ్డారు. మా ప్రభుత్వాన్ని మూడో పంటకు కూడా రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఒక ఒక పంటకే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏటా ఒక సీజన్‌కే రైతు భరోసా ఇస్తూ.. రుణామాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మొదటి బడ్జెట్లో పెట్టినట్లుగా ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని విమర్శించారు. రెండు బడ్జెట్లలో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్లో మాయమైందని అన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కూడా రెండు బడ్జెట్లలో పెట్టారని, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్లో చెప్పారని, ఈసారి బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయాన్ని వచ్చే ఏడాదికల్లా రూ.12 వేల కోట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 34 వేల కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.46 వేల కోట్లకు ఎట్లా పెంచుతారని, ఊరూరుకు బార్లు ఓపెన్ చేస్తారా..? అని నిలదీశారు. దాంతో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కలుగజేసుకుని కాంగ్రెస్ హయాంలో రూ.12 వేల కోట్లుగా ఎక్సైజ్ ఆదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.36 వేల కోట్లు పెంచిందని అన్నారు.
జూపల్లి కలుగజేసుకోవడంపై హరీష్‌రావు అసహనం వ్యక్తంచేశారు. తన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కగారు సమాధానం చెప్పాలని అన్నారు. తాను బడ్జెట్‌పై ప్రశ్నలు అడుగుతున్నానని, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సబ్జెక్టుపై కాదని చెప్పారు. ఈ సందర్భంగా తలసాని జోక్యం చేసుకుని ప్రభుత్వ తీరును విమర్శించారు.