బోనస్‌ను బోగస్ చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు సకాలంలో డబ్బులు పడటం లేదు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి పదవిలో ఉండటం అవసరమా? -హరీశ్‌రావు
గజ్వేల్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల భామలను చూసేందుకు ఐదుసార్లు వెళ్లిన రేవంత్‌రెడ్డికి.. మార్కెట్లో వడ్లు ఎందుకు కొంటలేరో చూసేందుకు సమయమే దొరకలేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నా యకుల విందులు, వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారా? అని నిలదీశారు. డబ్బుల్లేవంటున్న రేవంత్‌రెడ్డి అందాల పోటీల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేయడం వల్ల ఎవరికై నా కడుపు నిండిందా? అని ప్రశ్నించారు. ఇంగ్లండ్ సుందరితో రేవంత్ సన్నిహితులు అనుచితంగా ప్రవర్తించి దేశ, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానకాలంలో జనుము, జీలుగ విత్తనాలు ఇవ్వడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చేతకావడం లేదని, ఎక్కడా విత్తనాలు దొరకడం లేదని, వాటి ధర డబుల్ చేసిన చేతకాని దద్దమ్మ ప్రభు త్వం రాష్ట్రంలో ఉన్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జీలుగ విత్తనాలు 1,100 ఉంటే, రేవంత్ ప్రభుత్వం ఆ ధరను రూ. 2,200 చేసిందని విమర్శించారు. తరుగు పేరుతో ఐదు నుంచి పది కిలోలు కోతపెడుతున్నారని, సన్నవడ్లకు రూ.1,100 కోట్లు బాకీ పడిన ప్రభుత్వం ఆ డబ్బులను ఎగబెడుతుందేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు. రైతులకు విత్తనాలు ఇవ్వలేని సీఎం పదవిలో ఉండటం అవసరమా? అని ప్రశ్నించారు.
ఉద్యోగాలేవీ?
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించా రు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన 1.67 లక్షల ఉద్యోగాలను రేవంత్ ఇచ్చారని దుయ్యబట్టారు. గురుకుల విద్యార్థులకు కేసీఆర్ కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పించారని, కానీ రేవంత్ ప్రభుత్వంలో 60-70 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీ సుందరీకరణను మధ్యలోనే ఆపేశారని, హెచ్‌సీయూపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు. తుగ్లక్ పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వివరించారు. తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని కోరారు.
ఇదేనా మార్పు?
మార్పు మార్పు అని చెప్పిన రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లిలో మార్పు తీసుకొచ్చారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ తల్లి ఉద్యమానికి స్ఫూర్తి అని, ఆ తల్లి దీవెనతోనే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అసాధ్యమని అన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి బంద్ చేస్తావా? మెడికల్ కాలేజీలు మారుస్తావా? సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తీసేస్తావా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
పథకాలన్నీ మాయం
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, నీళ్లు బంగారంలా వస్తుండేవని, సర్కారు దవాఖానకు పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేవారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్ రాకతో అవన్నీ బందయ్యాయని అన్నారు. దేవుడి మీద ఒట్టేసి మాటతప్పిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిజ స్వరూపం సాధారణంగా మూడు నాలుగేండ్లకు బయటపడతదని, కానీ మూడు, నాలుగు నెలలకే రేవంత్ బండారం బయటపడిందన్నారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డిని సన్మానించిన హరీశ్‌రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వర్గల్ మండలం తునికిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, బట్టు సుధాకర్‌రెడ్డి, మర్కూక్ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.