హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నట్టు తెలిసింది. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన సాఫ్ట్వేర్ తుది పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ధరణిపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ ఇటీవల సమావేశమై ప్రధానంగా 11 అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇందులో ఎన్ని అంశాలపై మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెస్తారో త్వరలో స్పష్టత రానున్నది.
ధరణిలో ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్యల్లో ‘నిషేధిత జాబితా’ ఒకటి. తమ పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరాయని, ప్రభుత్వం గతంలో కొంత భూమిని సేకరిస్తే.. ఇప్పుడు సర్వే నంబర్ మొత్తం నిషేధిత జాబితాలో చేరిందని.. ఇలా అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటివాటి కోసం ధరణిలో ఇప్పటికే ‘నిషేధిత భూములపై ఫిర్యాదు’ పేరుతో టీఎం-16 మాడ్యూల్ అందుబాటులో ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు లక్ష దరఖాస్తులు రాగా అధికారులు 80 శాతానికిపైగా పరిష్కరించినట్టు తెలిసింది. గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ లేకపోవడం, ఇతర కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేయలేకపోతున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సేకరించిన భూములకు సంబంధించి దరఖాస్తు చేసినా, చేయకున్నా ఆయా శాఖల నుంచి సమాచారం తెప్పించుకొని పరిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సేకరించిన భూమిని నిషేధిత జాబితాలో ఉంచి, మిగతా జాగాను తొలిగించనున్నట్టు సమాచారం.
ఏదైనా కారణం వల్ల లావాదేవీ నిలిచిపోతే ఫీజు మొత్తాన్ని తిరిగి వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని లావాదేవీల్లో సాంకేతిక సమస్యల వల్ల డబ్బు తిరిగి రావడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటినీ త్వరలో పరిష్కరించనున్నట్టు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.