మంచిర్యాల, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు దమ్ముంటే సింగరేణి అక్రమాలపై చర్చించేందుకు శాసనసభ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సింగరేణి స్కామ్‌లను ఆధారాలతో సహా రుజువు చేయడానికి తాను సిద్ధమని, ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో బుధవారం శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులతో నిర్వహించిన ‘సింగరేణి పరిరక్షణ సదస్సు’కు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండున్నరేండ్లలో పాలనలో సింగరేణిలో జరిగిన స్కామ్‌లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రెండు నెలలుగా సింగరేణి స్కామ్‌లను బీఆర్ఎస్ బయటపెడుతుంటే ముఖ్యమంత్రి గానీ, ఉప ముఖ్యమంత్రి గానీ ఎందుకు నోరు విప్పడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ దెబ్బకు దిమ్మదిరిగి కొన్ని స్కామ్‌లు ఆగిపోయాయని, మరికొన్నింటి టెండర్లు చేంజ్ అయ్యాయని చెప్పారు.నిజంగా తాము చెప్పిన వాటిలో అవాస్తవాలు ఉంటే తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు నోరు మూసుకున్నారో కార్మికులు అర్థం చేసుకోవాలన్నారు. ఈ స్కాముల్లో ప్రధాన సూత్రధారి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్రెడ్డేనని విమర్శించారు.
కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16వేల మందికి ఉద్యోగాలిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్‌రావు తెలిపారు. రామగుండంలో బీఆర్ఎస్ డిపెండెంట్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడితే.. దెబ్బకు డిప్యూటీ సీఎం భట్టి, నలుగురు మంత్రులు వచ్చి 330 మందికి కారుణ్య నియామకాల కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. ‘16వేల ఉద్యోగాలిచ్చినా మనమేమో చెప్పుకోలేదు, కానీ వాళ్లు 300 ఇస్తే నలుగురు మంత్రులు వచ్చారు’ని పేర్కొన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్, ఎక్స్‌ప్లోజివ్స్ స్కామ్, డీజీల్ స్కామ్‌లను దాదాపు గంటన్నర పాటు కార్మికులకు వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, పుట్ట మధు, కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ హరి, విజిత్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సురేందర్‌రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.