సిద్దిపేట, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. యాసంగి సాగుపై మెదక్ జిల్లా రైతాంగం తీవ్ర అయోమయంలో ఉన్నదని, సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. వేసవిలో చేయాల్సిన సింగూరు మరమ్మతులు ఇప్పుడు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ పాలనలో మళ్లీ బోర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. గత యాసంగి, ఈ వానకాలానికి సంబంధించిన బోనస్ బకాయిలు రూ.1,800 కోట్లు విడుదల చేయాలని డి మాండ్ చేశారు. వ్యవసాయానికి యాప్‌లు, మ్యాప్‌లు కాదు.. నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలని హితవు చెప్పారు. కొత్త చట్టాల పేరుతో కౌలురైతులు, యజమానుల మధ్య పంచాయితీలు పెడుతున్నారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డీ.. ఫుట్‌బాల్ షోకుల కోసం రూ.ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినవ్. అందాల పోటీ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసినవ్. నువ్వు, నీ మనుమడు క్రికెట్ ఆడటానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తరా?
-హరీశ్‌రావు
గురువారం బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లను సతరించి అభినందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల మెదక్ జిల్లా రైతాంగం అగమ్యగోచర స్థితిలో ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి పంట సాగు చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నా రు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని ఖాళీ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉన్నదని, పంటను కాపాడుతూనే మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నాట్లు వేసే సమయం ఆసన్నమైనా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక మళ్లీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ది మామూలు విజయం కాదు. ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్‌లు 80 నుంచి 90% గెలుస్తారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40% సర్పంచ్‌లు గెలిచింది. రేవంత్‌రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ఓటర్లు తీర్పు ఇచ్చారు.
-హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో రైతులను దారుణంగా మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ పూర్తిచేశారని దుయ్యబట్టారు. యాసంగి ప్రారంభమైనా పెట్టుబడి సాయం ఊసేలేదని మండిపడ్డారు. సాగు చేసిన వారికే రైతుభరోసా ఇస్తామంటూ సాకులు వెతుకుతూ పత్తి, చెరుకు, పసుపు సాగు చేసే రైతులకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి కోతలు లేకుండా రైతుభరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోయిన వానకాలంలో యూరియా, జనుము, జీలుగు విత్తనాలు దొరక రైతులు అష్టకష్టాలు పడ్డారని ఆయన చెప్పారు.
సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు రేవంత్‌రెడ్డి గూబగుయ్యిమనిపిచ్చిండ్రు. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి మైండ్‌బ్లాక్ అయితది. బీఆర్ఎస్ సర్పంచ్ల విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేయరు. 90% గెలువాల్సిన అధికార పార్టీ 50% లోపే పరిమితమైంది. రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారో గ్రహించారు.
-హరీశ్‌రావు
‘మన సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బందులు పెడితే నాకు ఒక మెసేజ్ పెట్టండి. నేనే డైరెక్ట్‌గా మీకు అండగా ఉంటా. మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మిమ్మలన్ని తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి. రెండేండ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. వడ్డీ సహా చెల్లిద్దాం. అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి. ఏకపక్షంగా ఎవరి కోసమో పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతాం’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
వ్యవసాయానికి నీళ్లు, కరెంటు, ఎరువులు ఇవ్వడం చేతగాక ఈ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్ఫోన్లు లేని మహిళా రైతులు అధికారుల చుట్టూ తిరగాలా? నెట్వర్లేని గ్రామాల్లో రైతులు ఈ యాప్‌లు ఎలా వాడతారు? అని ప్రశ్నించారు. ఇది కేవలం ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. పత్తి రైతులకు కపాస్ యాప్ తెచ్చి బీజేపీ ముంచితే, ఎరువుల కోసం యాప్ తెచ్చి కాంగ్రెస్ ముంచుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలు రైతుల భవిష్యత్తును కూడా ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే యాప్ నాటకాలు బంద్ చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పతనానికి, పల్లె ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో తిరిగినా.. తెలంగాణ జనం ఆయనను బండకేసి కొట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగారని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైతులకు యూరియా దొరకనప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు? పగలూరాత్రీ రైతులు లైన్లో నిలబడి యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు? గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు?’ అని ప్రశ్నించారు. ప్రజలు తెలివైనోళ్లు. మిమ్మల్ని బండకేసి కొట్టి, బీఆర్ఎస్ను గెలిపించారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలుచేయాలని అడిగితే, అందాల పోటీలు పెడతూ.. వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతా అంటుండు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.