Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయయన్నారు. సింగరేణిలో జరిగిన స్కాంలు మొత్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయన్నారు. ఇవి నేను చెప్పడం లేదు.. సింగరేణి గణాంకాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు. ‘రేవంత్ రెడ్డి పాలనలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టడం వల్ల ఉత్పత్తి పడిపోయింది.BRS హయాంలో 2021లో 50 MT, 2022లో 62 MT, 2023లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం.కాంగ్రెస్ రాగానే 2024-25లో 69 MTకి తగ్గింది. ఇప్పుడు 2025-26లో (గత 9-10 నెలల్లో) కేవలం 43 మిలియన్ టన్నులకు పడిపోయింది.’ అని హరీశ్‌రావు తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ లాభాల బాట పట్టిస్తే… రేవంత్ రెడ్డి 6000 కోట్ల కుంభకోణంతో సింగరేణికి మచ్చ తెచ్చారన్నారు.
చంద్రబాబు ఆపేస్తే, కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 19,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడున్న 42,000 మందిలో సగం మంది వారసత్వ ఉద్యోగులే అని తెలిపారు. కేసీఆర్ నెలకు ఒక మెడికల్ బోర్డు నిర్వహించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రెండేసార్లు బోర్డు పెట్టిందని అన్నారు. మొదటి బోర్డులో 55 మంది వస్తే కేవలం 5 మందిని, రెండో బోర్డులో 123 మంది వస్తే కేవలం 23 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేశారన్నారు. ఇలా మెడికల్ బోర్డులో కొర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు యశోద, కిమ్స్ వంటి ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం బంద్ చేశారని.. నిమ్స్, ఉస్మానియాకు పొమ్మంటున్నారని తెలిపారు.
కేసీఆర్ కార్మికులకు ఇళ్లు ఇచ్చి ఓనర్స్ చేస్తే… కాంగ్రెస్ ఒక్కరికైనా ప్లాట్ ఇచ్చిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సింగరేణి గడించిన మొత్తం లాభం 6,394 కోట్లు అయితే, కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ గా చూపించారని.. మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించారు. కార్మికుల బోనస్‌లో కోత పెట్టి, ఆ డబ్బును ఫుట్‌బాల్ సోకులు, ముఖ్యమంత్రి ప్రచారాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. రెండేళ్లలో సింగరేణి అభివృద్ధి కోసం పక్కన పెట్టిన 6,000 కోట్లు ఏమయ్యాయయని నిలదీశారు. ఆ స్కాంను కూడా త్వరలో బయటపెడతామని తెలిపారు.
సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలన్నారు. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు. లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరాకరించిన కంపెనీల మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయటపెట్టాలి. భట్టి గారూ… మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టం. సిరుల గని సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.