Sprouts | మన శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండే ఆహారాల్లో మొలకలు కూడా ఒకటి. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇవి పోషక శక్తి కేంద్రాలు అని చెప్పవచ్చు. ఇవి మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా మార్చగల శక్తిని కలిగి ఉంటాయి. వీటిని రోజూ ఉదయం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, శక్తి స్థాయిలను పెంచడంలో, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా మొలకలు మనకు సహాయపడతాయి. ఇవి మొత్తం శరీరానికి మేలు చేస్తాయని వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఆహారంలో భాగంగా మొలకలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
మొలకల్లో సహజ ఫైబర్ తో పాటు జీర్ణ ఎంజైమ్ లు కూడా ఉంటాయి. మొలకలను ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా విచ్ఛినం అవుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల పేగుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మొలకల్లో సహజంగా ఉండే జీర్ణ ఎంజైమ్ లు ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్స్, కొవ్వులను విచ్చినం చేయడంలో సహాయపడతాయి. తద్వారా మన శరీరానికి పోషకాలు సక్రమంగా అందుతాయి. మొలకలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ఉదయం పూట మొలకలను తీసుకోవడం వల్ల ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకోగలుగుతాం. మొలకలను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. వీటిని అల్పాహారంలో భాగంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సాధారణ జలుబు, కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సాధారణంగా మొలకల్లో ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి స్థిరమైన, సహజ శక్తిని అందిస్తాయి. వీటిని ఉదయం పూట ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నీరసం, అలసట వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
మొలకల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొలకలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. దీంతో మనకు చిరుతిండి తినాలన్న కోరిక కలగకుండా ఉంటుంది. తద్వారా మనం ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. మొలకల్లో విటమిన్ ఎ, సి, ఇ వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహించడంలో సహాయపడతాయి. ఉదయం పూట మొలకలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరిసే ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా మొలకలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొలకలను ఆహారంలో భాగంగా స్థిరంగా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.