Harish Rao | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ‘మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభలో రేవంత్‌రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పిండ్రు. మంత్రి అవినీతికి పాల్పడ్డప్పుడు సీబీసీఐడీ ఎట్లా ఎంక్వయిరీ చేస్తది? ఆయన మంత్రిగా ఉండగా విచారణ సాధ్యమా? గవర్నమెంట్ కింద పనిచేసే పోలీసులు గవర్నమెంట్ మీద ఎంక్వయిరీ చేస్తారా?’ అని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అందుకే మంత్రి పొంగులేటిని డిస్మిస్ చేయాలని, లేదంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, అదీ కుదరకపోతే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని కాపాడేందుకే సీఎం సీబీసీఐడీ ఎంక్వయిరీ వేశారని చెప్పారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కొత్తా ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడుతూ పట్టపగలే రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలు సహా దొరికిపోయిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని హరీశ్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు ఎగ్గొట్టిందనే విషయం చర్చ చూసిన ప్రజలకు, ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి బాగా అర్థమైందని తెలిపారు. తప్పు జరిగిందనే విషయం అర్థమవడంతో డిఫెన్స్‌లో పడి.. సీఎం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయడమంటే ప్రశ్నించే గొంతుకల మీద దాడేనని అభివర్ణించారు. ‘మొదట్నుంచీ కౌశిక్ రెడ్డి నికచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. అవినీతిని నిలదీస్తూ గట్టిగా మాట్లాడుతుండటం వల్లే రేవంత్ రెడ్డి పగబట్టారు. పోలీసులను పెట్టి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేయించారు. ఎంక్వైరీ వేశారు. అనేక అక్రమ కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసులు అక్రమమని కోర్టులే రిమాండ్ చేయకుండా బెయిల్ ఇచ్చాయి’ అని తెలిపారు.
ముఖ్యమంత్రీ.. నువ్వు సత్యహరిశ్చంద్రుడ వైతే.. తప్పు చేయకపోతే.. మాట మీద నిలబడే మనిషివైతే.. నీలో చీమూనెత్తురుంటే.. నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం నీ 20 కుంభ కోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. లేదంటే హౌస్ కమిటీ వెయ్.. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా నీ సామ్లను వదలబోం.
-హరీశ్ రావు
కౌశిక్‌రెడ్డి గురించి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నానని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని, అసలు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మొట్టమొదట ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని హరీశ్ చెప్పారు. ‘నిండు సభలో బద్మాష్, బడివే వంటి భాష మాట్లాడినవు కదా.. నోటితో నేను చెప్పలేని, ఉచ్ఛరించలేని భాషలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ కావాలి. శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్‌రెడ్డి మీద అనర్హత వేటు వేయాలి’ అని మండిపడ్డారు. ఇది ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్టు ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు గొంతునొక్కుతూ తమకు మైకులు ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా కక్షతో ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అరమైందని చెప్పారు.
‘అదానీ కుంభకోణాలపై, స్టాక్ మారెట్ క్రాష్, కేంద్ర ప్రభుత్వ కుంభకోణాలపై ఒకటికి పదిసార్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్లో రాహుల్‌గాంధీ నిలదీస్తూ వస్తున్నరు. మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు… బీఆర్ఎస్ అడిగితే తప్పా? హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు ముందుకొస్తలేరు?’ అని హరీశ్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే ఓబులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసిందని గుర్తుచేశారు. ఇప్పుడెందుకు భయపడుతున్నారని నిలదీశారు. ‘ఎకడో హెచ్ఎండీసీఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరేజ్ చార్జీ ఆటోమేటిక్‌గా కట్ చేశారు. దానికి, ఈ అక్రమ మైనింగ్‌కు సంబంధం లేదు. అసలు ఇల్లీగల్ మైనింగ్‌కు సీనరేజ్ చార్జీ కట్టుడు ఉంటదా? మైనింగే ఇల్లీగల్. దానికి ఫైన్ కట్టుడు ఎకడ ఉంటది?’ అని ప్రశ్నించారు. మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖలను మంత్రి టిష్యూ పేపర్లా పడేశారని చెప్పారు. ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతూ.. పది తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏ ల్యాండ్ సామ్ జరిగినా పొంగులేటి, ముఖ్యమంత్రికి మధ్య 50-50 శాతం కమీషన్ వాటాలుంటయ్. ల్యాండ్ క్లియర్ కోసం 30% తీసుకుంటే.. ఆ 30 శాతంలో 50 శాతం ముఖ్యమంత్రికి, 50 శాతం రెవెన్యూ మంత్రి పొంగులేటికే. అందుకే ఆయనను ఈయన, ఈయనను ఆయన కాపాడుతాడు.
– హరీశ్‌రావు
‘ఈ ప్రభుత్వం సీఫ్ఈ, సీఎఫ్‌వో లేవని రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు కరెంట్ కనెక్షన్ కట్ చేసింది. అవి ఉంటేనే కనెక్షన్ ఇస్తామని చెప్పింది. వాటిని సబ్మిట్ చేసినోళ్లకే కరెంట్ ఇచ్చిండ్రు. కొన్ని వందల కంపెనీలకు నేటికీ కరెంట్ ఇవ్వలేదు’ అని హరీశ్ చెప్పారు. ‘పొంగులేటి కంపెనీకి పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సీఎఫ్ఈ, సీఎఫ్‌వో అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేకపోవడంతో అక్రమంగా జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పు ఒప్పుకోలేక, మంత్రిని కాపాడుకునేందుకు మీటర్ల షార్టేజ్ ఉన్నదని మైనింగ్ మంత్రి మరో తప్పు మాట్లాడారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు ఇచ్చినట్టు కూడా తనకు తెల్వదని మైనింగ్ మంత్రి అంటున్నాడని చెప్పారు. తానే అసెంబ్లీలో ఫస్ట్ షోకాజ్ నోటీస్, సెకండ్ షోకాజ్ నోటీస్, డిమాండ్ నోటీస్, పెనాల్టీ పేపర్, లెటర్ రిటన్ టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ టేకింగ్ యాక్షన్ వంటి ఆధారాలు చూపించానని చెప్పారు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టే తనకు తెల్వదని మంత్రి ఎలా అంటాడని ప్రశ్నించారు. ‘రూ.4 లక్షలకే ఇంత మాట్లాడుతారా?’ అని ఎలా అంటారని నిలదీశారు.
పొంగులేటి కంపెనీలో మొదటిసారి తనిఖీలు చేస్తే 5,130 మెట్రిక్ టన్నుల మెటల్ ఉండటంతో రూ.28.50 లక్షలు కట్టుమన్నారని, రెండోసారి తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నులు దొరికిందని షోకాజ్ నోటీస్ ఇచ్చారని హరీశ్ చెప్పారు. అవి కాలిక్యులేట్ చేస్తే రూ.కోటిపైనే పెనాల్టీ పడుతుందని తెలిపారు. ‘రెండోసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష వేయాలని రూల్స్ చెప్తున్నాయి. అది ఎన్నేండ్ల నుంచి నడుస్తుంది? అనేది లెక తీస్తే.. రెండున్నరేండ్ల నుంచి రోజుకు రూ.కోటి చొప్పున ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది? ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి?’ అని ప్రశ్నించారు. పొంగులేటి కంపెనీ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని చెప్పారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొంగులేటి అక్రమాలపై ఎర్రోళ్ల శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్‌కు, ఎంఏఅండ్యూడీకి, మైనింగ్కి అన్నింటికీ 50 ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సంతకాలు పెట్టి సీఎంకు లేఖ రాసి ముఖ్యమంత్రికి పంపితే.. బిజీగా ఉన్నానని భట్టి విక్రమార్కతో చెప్పించారని, అందుకే అసెంబ్లీలోనే మాట్లాడి, స్పీకర్ ద్వారా విచారణ చేయించాలని ముఖ్యమంత్రికి లేఖ పంపినట్టు చెప్పారు.
అదానీ కుంభకోణాలపై, స్టాక్ మారెట్ క్రాష్, కేంద్ర ప్రభుత్వ కుంభకోణాలపై ఒకటికి పదిసార్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీస్తూ వస్తున్నడు. మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు.. బీఆర్ఎస్ అడిగితే తప్పా? హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు ముందుకొస్తలేరు?
– హరీశ్‌రావు
‘సీఎం గారూ.. నువ్వు పారదర్శకంగా ఉన్నానని, ఏ విచారణకైనా సిద్ధమని మాట్లాడినవ్ కదా? నీ 20 స్కామ్‌లపై నీకు లేఖ పంపినం. వాటిపై విచారణకు సిద్ధమేనా’ అని హరీశ్ స వాల్ చేశారు. వాటిలో సివిల్ సప్లయ్ సామ్.. అమృత్ టెండర్లు, కేఎల్ఎస్ఆర్, నైని కోల్ బ్లాక్, సింగరేణి ఓబీ టెండర్లు, ఎన్టీపీసీ థర్మల్ పవర్, హెచ్‌సీయూ భూములు, లగచర్ల ల్యాండ్, కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్లవి , ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రేవరీ, హ్యామ్ రోడ్ల సామ్, టీడీఆర్, యంగ్ ఇండియా సూల్స్, ఫోర్త్ సిటీ, హెచ్‌టీ పీ సామ్, అక్రమ మైనింగ్, డెకన్ సిమెంట్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణం వంటివి ఉన్నాయని వివరించారు.
త్వరలోనే పక్కా ఆధారాలతో మరో భూ కుంభకోణాన్ని కూడా బయటపెట్టబోతున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. ‘ఇవాళ పొంగులేటి, రేవంత్‌ది ఫెవికాల్ బంధం. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ టెండర్ పొంగులేటికే కదా ఇచ్చింది? నీకు ఇష్టమైన మూసీ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినవ్? పొంగులేటికే కదా?’ అని ప్రశ్నించారు. ‘పొంగులేటి మీద చర్యలు తీసుకోవాలని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు 8నెలల కింద ఉత్తరం రాస్తే.. అప్పటి నుంచి ఏం చేస్తున్నరు? గాడిద పండ్లు తోముతున్నారా?’ అని ప్రశ్నించారు. పొంగులేటిని బర్తరఫ్ చేసి, హౌస్ కమిటీ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు.
అసెంబ్లీ మాక్ అసెంబ్లీ అయిపోయింది. మాకు మైకే ఇవ్వట్లేదు. నాలుగున్నర గంటలు నిలబడ్డం. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వాలని అడిగినం. మా దిక్కు కూడా చూడలేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతి ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొకడమేనా? ఇదేం పద్ధతి? హౌస్ కమిటీ అడిగితే తప్పా? ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము ప్రశ్నించడం తప్పా?
– హరీశ్‌రావు
మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్‌పై తప్పించుకోవడానికి తనపై, కౌశిక్‌రెడ్డిపై మాటలతో దాడి చేస్తున్నారని, దళితకార్డు వాడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేనూ నా కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డామని అంటున్నరు. నా తమ్ముడు, నా బావమరిదిపై ఆరోపలు చేసినవ్. హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధమే. నీ తమ్ముళ్లు చేసిన భూ కంభకోణాలు, టీడీఆర్, కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణాలపై నువ్ రెడీ అయితే.. నేను కూడా రెడీ. నా బావమరిదిపై నువ్ ఆరోపణలు చేసినవ్ కదా? నీ బావమరిది సృజన్‌రెడ్డి అమృత్ టెండర్లు, సింగరేణిలో ఓబీ టెండర్ల కుంభకోణాలపై నువ్ రెడీ అయితే.. నేను రెడీ రేవంత్‌రెడ్డీ’ అని సవాల్ విసిరారు. ‘నేను చెప్పిన హౌస్ కమిటీ వద్దు.. నువ్ చెప్పిన సీబీసీఐడీ వద్దు.. చేతనైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిద్దాం సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో తోకముడిచి పారిపోవద్దని, చెంచాగాళ్లతో తిట్టించొద్దని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తానెప్పుడూ పైరవీల కోసం పొంగులేటికి ఫోన్ చేయలేదని, కేవలం గృహలక్ష్మీ కోసమే ఫోన్ చేశానని చెప్పారు. అలా చేసే చరిత్ర తనకు లేదని స్పష్టంచేశారు.
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
నా మీద, నా కుటుంబసభ్యుల మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, హౌస్ కమిటీ వేస్తానని అన్నాడు
నేను రెడీ.. అలానే రేవంత్ రెడ్డి సోదరులు, ఆయన బావమరిది సృజన్ రెడ్డి చేసిన అక్రమాలపై కూడా హౌస్ కమిటీ వేస్తాడా?
ఇవేం వద్దు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి… pic.twitter.com/kV7TNEoA81
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
కాంగ్రెస్ నేతలకు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు.. పెద్దగా ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రత్యేక నిధులు ల్యాప్స్ కావొద్దని, ఏదైనా ఏడాదిపాటు ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలన్న చట్టాన్ని తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దాన్ని 10 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ‘2024-25లో నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు కేవలం రూ.1,395 కోట్లు. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.7,361 కోట్లు. దళితుల పట్ల నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో ఉన్నది’ అని లెక్కలు సహా చెప్పారు. ‘ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు రూ.3,267 కోట్లు కేటాయించి.. ఖర్చు పెట్టింది కేవలం రూ.28 కోట్లు కాదా? ఇదా నీ ప్రేమ దళితుల మీద? దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో సున్నా నిధులు కేటాయించినవ్. ఎస్సీ, ఎస్టీ, ఎస్డీఎఫ్లో 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. నీకు దళితులపై ఉన్నది కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ లేదు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవ్ గానీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినవా? ఎస్సీ డిక్లరేషన్‌లో ఒకటి కూడా అమలు చేయకుండా దళిత, గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, ఆయన ప్రభుత్వానిది’ అని తూర్పారబట్టారు.
‘ఏ ల్యాండ్ సామ్ జరిగినా పొంగులేటి, ముఖ్యమంత్రికి మధ్య 50-50 శాతం కమీషన్ వాటాలు ఉంటాయి. ల్యాండ్ క్లియర్ కోసం 30% తీసుకుంటే.. ఆ 30 శాతంలో 50 శాతం ముఖ్యమంత్రికి, 50 శాతం రెవెన్యూ మంత్రి పొంగులేటికే. అందుకే ఆయనను ఈయన, ఈయనను ఆయన కాపాడుతాడు’ అని హరీశ్ పేర్కొన్నారు. మంత్రిపై హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదని, అలా వేస్తే వాళ్ల స్కాములు, దందాలు బయటపడుతాయని ఎద్దేవాచేశారు. నాడు నిషేధిత భూములు తీసేస్తామని చెప్పి, నేడు కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో పెట్టారని చెప్పారు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉన్నదని, రేవంత్‌రెడ్డి, పొంగులేటి కూడబలుకొనే పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని మండిపడ్డారు.